Sep 19,2023 20:53

ట్రిపుల్‌ఐటి విద్యార్థి ఆత్మహత్య

ప్రజాశక్తి - వేంపల్లె (కడప జిల్లా) : ఆర్‌జియుకెటి పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటిలో విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా లింగాల మండలంలోని తేర్నంపల్లెకు చెందిన గంగాధర్‌, నారాయణమ్మ దంపతుల పెద్ద కుమారుడు గంగారామ్‌ (20) సివిల్‌ విభాగంలో (ఇ-3) గంగారామ్‌ మూడవ సంవత్సరం చదువుతున్నారు. గంగారామ్‌ ఒక్కడే గదికి గడియ వేసుకుని ఉండడంతో తోటి విద్యార్థులు తలుపులు కొట్టినా, పిలిచినా స్పందన రాకపోవడంతో అధికారులకు సమాచారం అందించారు. డైరెక్టర్‌ సంధ్యారాణి, ఒఎస్‌డి గంగిరెడ్డి, సిబ్బంది వచ్చి గది తలుపులను పగుల కొట్టించి లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని గంగారామ్‌ మృతిచెంది ఉన్నాడు. విద్యార్థి తల్లిదండ్రులకు వారు ఈ విషయం తెలియజేశారు. గంగరామ్‌ మృతదేహాన్ని వేంపల్లె ఆస్పత్రికి తరలించారు. సిఐ గోవింద్‌రెడ్డి ఈ ఘటనపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.