- విప్రో సర్కిల్ నుంచి ఒఆర్‌ఆర్ వరకు ఐటి ఉద్యోగులు ర్యాలీ
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో ఐటి ఉద్యోగులు బుధవారం ఆందోళనకు దిగారు. అయామ్ విత్ సిబిఎన్ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ వందలాది ఐటి ఉద్యోగులు విప్రో సర్కిల్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును వారు తీవ్రంగా ఖండించారు. అయామ్ విత్ సిబిఎన్ అని రాసిఉన్న ఫ్లెక్సీలు, ప్ల కార్డులు ప్రదర్శిస్తూ చంద్రబాబు నిర్దోషి అంటూ నినాదాలు చేశారు. విప్రో సర్కిల్ వద్ద ఐటి ఉద్యోగులు భారీ సంఖ్యలో గుమికూడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆందోళనకు దిగిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. దీంతో విప్రో కూడలిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఐటి ఉద్యోగులు మాట్లాడుతూ రాజకీయ కోణంలో కక్ష సాధించేందుకే చంద్రబాబును జైలుకు పంపారని ఆరోపించారు. ఆయనపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టిడిపి హయాంలో తీసుకున్న విధానాల వల్లే తమలాంటి లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని, విదేశాల్లోనూ చాలామంది స్థిరపడ్డారని తెలిపారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన ఆయనకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వారు స్పష్టంచేశారు. కక్ష సాధింపు రాజకీయాల వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనమూ ఉండదని, అభివృద్ధికి విఘాతమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని ఐటి ఉద్యోగులు పేర్కొన్నారు.










