Aug 14,2022 12:43

తెలుగులో అనువాద చిత్రాలకు చాలా క్రేజ్‌ ఉంది. అందుకే అనేక భాషలకు చెందిన సినిమాలను తెలుగులోకి అనువదిస్తుంటారు. అయితే అలా అనువాద చిత్రాలతో పరిచయమై, నేరుగా తెలుగులో చిత్రాలను నటించి, విడుదల చేసే స్థాయికి కొందరు నటులు మాత్రమే చేరుకున్నారు. రజనీ, కమల్‌, సూర్య ఇలా కొందరు హీరోలు తెలుగులో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆ కోవలో ఎక్కువగా తమిళ నటులే ఉండేవారు. కాగా ప్రస్తుతం మళయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ ఆ స్థానాన్ని సంపాదించుకున్నారు. మహానటితో తెలుగు తెరకు పరిచయమైన దుల్కర్‌ తాజాగా 'సీతారామం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఈ సందర్భంగా నటుడు దుల్కర్‌ సల్మాన్‌ మీడియాతో పంచుకున్న కొన్ని ఆసక్తికర విశేషాలు..

పేరు : దుల్కర్‌ సల్మాన్‌
ఇతర పేర్లు : సాలు, డిక్యూ
పుట్టిన తేదీ : 28 జులై, 1986
పుట్టిన ప్రాంతం : కొచ్చి, కేరళ
చదువు : బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ
భార్య : అమాల్‌ సూఫియా
పిల్లలు : మర్యమ్‌
తల్లిదండ్రులు : మమ్ముట్టి, సుల్ఫాత్‌ కుట్టి
తోబుట్టువులు : సురుమీ కుట్టి

ప్రముఖ నటుడు మమ్ముట్టి కొడుకుగా తెరంగేట్రం చేసినా విజయాన్ని మాత్రం తన సొంత ప్రతిభతోనే సంపాదించుకున్నారు. ఏ భాషలో నటిస్తే ఆయా చిత్ర పరిశ్రమల వారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ఆయనే మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌. మళయాళంలో 2012లో విడుదలైన 'సెకండ్‌ షో' చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత 'ఉస్తాద్‌', 'వాయై మూడి పేశపురం' చిత్రంతో తమిళంలోనూ నటించారు. కాగా 'మహానటి' చిత్రంలో 'జెమిని గణేషన్‌'గా కనిపించి, తెలుగు వారికి దగ్గరైన ఆయన ప్రస్తుతం 'సీతారామం'లో రామ్‌గా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో దుల్కర్‌ మీడియాతో ముచ్చటించారు.

                                                        అందుకే ఫైట్లు, డ్యాన్స్‌లు నేర్పలేదు..

ప్రెస్‌మీట్‌లో దుల్కర్‌ మాట్లాడుతూ 'నేను సినిమాల్లోకి రావడం నాన్నకు ఇష్టం లేదు. అందుకే నాకు ఫైట్లు, డ్యాన్స్‌లు నేర్పించలేదు. ఆయన చెప్పినట్టు చదువుకుని దుబారులో కొంతకాలం ఉద్యోగం చేశాను. కానీ నాలుగు గోడల మధ్య ఉంటూ ఉద్యోగం చేయడం నా వల్ల కాలేదు. తిరిగొచ్చి హీరోగా ట్రై చేస్తానని నాన్నతో చెప్పాను. అప్పుడు ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. నాన్నని మొదటిసారి చాలా కోపంతో చూశాను. హీరోగా చేస్తానని చెప్పగానే.. ''నువ్వు ఎప్పుడూ సరదాగా కూడా డ్యాన్స్‌ చేయలేదు, యాక్టింగ్‌ చేయలేదు. యాక్టింగ్‌ అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అది నీవల్ల కాదు. నా పరువు తీసే ఆలోచనలు చేయకు!'' అని తిట్టారు. కానీ ఇప్పుడు ఆయనే నా సినిమాలు చూసి నన్ను అభినందిస్తున్నారు' అని తెలిపారు.
 

                                                              నాకు నచ్చితేనే చేస్తా..

'నేను లెక్కపెట్టి, ఓ క్రమంలో వరుసగా సినిమాలు చేయను. ఏ కథ నచ్చితే.. ఏ స్క్రిప్ట్‌ మనసుకు హత్తుకుంటే ఆ సినిమాను మాత్రమే చేస్తూ వెళ్తాను. మాస్‌ సినిమానా? లవ్‌ స్టోరీనా? అనేది కాదు, నాకు నచ్చితేనే చేస్తా' అని చెప్పుకొచ్చారు. అయితే 'సీతారామం' కథను హను రాఘవపూడి చెప్పినప్పుడు ఎంతో నచ్చిందని, సీత పాత్ర గురించి చెప్పినప్పుడు ఎంతో ఎగ్జైట్‌ అయ్యానని అన్నారు. అయితే తనకు క్యాస్టింగ్‌ విషయంలో అంతగా ఎక్స్‌పీరియెన్స్‌ గానీ, టాలెంట్‌ గానీ, ఊహించే శక్తిగానీ లేదని, ఏ పాత్రకు ఎవరు సూట్‌ అవుతారు? ఎవరైతే బాగుంటారనే విషయాన్ని అంచనా వేయలేనని తెలిపారు. అయితే కథ విన్నప్పుడు సీత పాత్రలో ఎవరు నటిస్తారా? అని ఎంతో ఎగ్జైట్‌ అయ్యానని అన్నారు. 'మణాళిని ఠాకూర్‌ ఆ పాత్రను పోషిస్తుందని హను చెప్పడంతో.. అయితే సెట్‌లో ఆమెను చూసి, ఆమె నటనను చూసి ఎంతో ఇంప్రెస్‌ అయ్యానని' దుల్కర్‌ చెప్పుకొచ్చారు.
 

                                                                 ఆయనే నాకు స్ఫూర్తి..

ఇక తన తండ్రి తనకు రియల్‌ హీరో అని, ఆయనే తన స్పూర్తి అని, తన ఇంట్లో తన తండ్రి సినిమాల మీద సిస్టర్‌ అండ్‌ మదర్‌ రివ్యూలు ఇస్తారని, ఫీడ్‌బ్యాక్‌ చెబుతారని తెలిపారు. కానీ తాను ఎప్పుడూ తన తండ్రి సినిమాలో నెగెటివ్‌ చెప్పలేదని, చూడలేదని అన్నారు. నేను ఎప్పుడూ ఆయన సినిమాల మీద పాజిటివ్‌గానే ఉంటానని అన్నారు. కాగా తన తండ్రి చేసినన్ని సినిమాలు, ప్రయోగాలు తనకు చేయాలని ఉందని తెలిపాడు. కానీ తనకంటూ ఓ మార్క్‌ ఏర్పడేట్టు ఉండాలన్నారు. మాస్‌ సినిమాలు, యాక్షన్‌ సినిమాలు చేసినా తన మార్క్‌, తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఉండాలని దుల్కర్‌ తెలిపారు.
 

                                                    ఆ ట్యాగ్‌లైన్‌ వినీవినీ విసుగొచ్చింది..

'అవును, ''పాన్‌ ఇండియా'' అనే ట్యాగ్‌లైన్‌ వినీవినీ విసుగొచ్చింది. ఆ పదం లేకుండా ఇటీవల ఒక్క ఆర్టికల్‌ కూడా కనిపించడం లేదు. పాన్‌ ఇండియా అనేది కొత్త కాన్సెప్టేమీ కాదు. అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ఖాన్‌, రజనీకాంత్‌.. ఇలా ఎంతోమంది నటించిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమై, ఆదరణ పొందాయి. ఇప్పుడు ప్రత్యేకంగా ''పాన్‌ ఇండియా'' అంటూ నొక్కి చెప్పాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. సినిమాని సినిమాగా చూస్తే చాలు. తెలుగు ప్రేక్షకులు నాపై చూపించే అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. పదేళ్లలో (అన్ని భాషలు కలిపి) 35 చిత్రాలంటే విశేషమేమీ కాదు. మలయాళ చిత్ర పరిశ్రమలో నా తోటి నటులు కొందరు ఏడాదికి 12 సినిమాలు చేస్తున్నారు. అంతెందుకు మా నాన్నే 30కి పైగా చిత్రాల్లో నటించిన సందర్భాలున్నాయి. వారితో పోల్చుకుంటే నేను తక్కువ చేసినట్లే!' అన్నారు.