Jul 09,2023 09:02

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకూ 126.1 మీమీ వర్షపాతం నమోదయింది. 20 ఏళ్లలో 24 గంటల వర్షపాతంలో ఇదే రికార్డు అని అధికారులు తెలిపారు. 2003 జులై 10న 133.4 మీమీ వర్షపాతం కురిసిందని, తరువాత ఇదే అత్యధికమని అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.భారీ వర్షానికి అనేక ప్రాంతాల్లో రహదారులు నీటమునగడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడ్డారు. అండర్‌పాస్‌ల్లోకి నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇండియాగేట్‌, ప్రగతి మైదాన్‌, నోయిడా మార్గంలో భారీ ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారులు అవస్థలు పడ్డారు. అత్యంత రద్దీగా ఉండే కన్నౌట్‌ ప్యాలెస్‌లోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.