Aug 29,2023 08:23

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-1, 2 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ఈ మేరకు అందిన ప్రతిపాదనకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి సోమవారం జిఓ 98ను విడుదల చేశారు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంటు ద్వారా వీటిని భర్తీచేయాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి)కు అనుమతిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. 89 గ్రూప్‌-1, 508 గ్రూప్‌-2 పోస్టులు భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఎపిపిఎస్‌సిని ఆదేశించారు. గ్రూప్‌-1 కింద రిజిస్ట్రర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీస్‌లోని 5 డిప్యూటీ రిజిస్ట్రర్‌ పోస్టులు, బిసి సంక్షేమశాఖలోని జిల్లా సంక్షేమ అధికారి పోస్టు, 4 జిల్లా ఉపాధి అధికారి పోస్టులు, ఆర్థిక శాఖలో 2 అసిస్టెంటు ఆడిట్‌ ఆఫీసర్‌ పోస్టులు, 6 అసిస్టెంట్‌ ట్రెజరీ అధికారి, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ అధికారి పోస్టులు, హోంశాఖలో 25 కేటగిరి-2 డిప్యూటీ సూపరింటెండ్‌ పోలీస్‌ పోస్టులు, డిప్యూటీ సూపరింటెండ్‌ జైల్స్‌ (పురుష) పోస్టు, జిల్లా అగ్నిమాపక అధికారి పోస్టు, మున్సిపల్‌శాఖలోని గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టు, రెవెన్యూలోని సిసిఎల్‌ఎలో 12 డిప్యూటీ కలెక్టర్లు, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌లలో 3 జిల్లా రిజిస్ట్రర్‌ పోస్టులు, సేల్స్‌ ట్యాక్స్‌లోని 18 అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఎస్‌టి) పోస్టులు, ఎక్సైజ్‌శాఖలో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండ్‌ పోస్టు, సాంఘిక సంక్షేమశాఖలో 3 జిల్లా సంక్షేమ అధికారి పోస్టులు, రవాణాశాఖలో 6 ప్రాంతీయ రవాణ అధికారుల పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. గ్రూప్‌-2 కింద సచివాలయ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు ఆర్థికశాఖలో 23, సాధారణ పరిపాలనల శాఖలో 16, న్యాయశాఖలో 12, అసెంబ్లీలో 10 చొప్పున భర్తీకి అనుమతిచ్చింది. మున్సిపల్‌ శాఖలో 4 గ్రేడ్‌-3 మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టులు, రెవెన్యూ శాఖ సిసిఎల్‌ఎలో 11 గ్రేడ్‌-2 డిప్యూటీ తహశీల్దార్‌ పోస్టులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో 16 గ్రేడ్‌-2 సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టులు, ఎక్సైజ్‌శాఖలో 15 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు, కార్మికశాఖలో 18 అసిస్టెంట్‌ కార్మిక అధికారి పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది.