ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్‌సి) భర్తీ చేసే గ్రూప్‌ా2, 3 పోస్టులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సిపిటి) సర్టిఫికెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకు సంబంధించిన గెజిట్ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి పోలా భాస్కర్ శనివారం విడుదల చేశారు. ఈ సర్టిఫికెట్ లేకుండా గ్రూప్‌ా2, 3 సర్వీసుల్లో నియామకానికి అవకాశం లేదంటూ అడహాక్ నిబంధనలను జారీ చేశారు. ఎపి సాంకేతిక విద్యామండలి నిర్వహించే సిపిటి పరీక్ష గానీ, యుజిసి నుంచి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నిర్వహించే పరీక్ష గానీ, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన నిర్వహించే పరీక్షలో గానీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ ఉండాలని పేర్కొన్నారు. లేదంటే ఎపిపిఎస్‌సి ఈ పరీక్షను నిర్వహిస్తుందని, 100 మార్కులకు దీనిని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలని పేర్కొన్నారు. 60 నిమిషాల పాటు నిర్వహించే ఈ పరీక్షలో ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగ అభ్యర్థులు 30 మార్కులు, బిసి 35, ఒసి అభ్యర్థులు 40 మార్కులు సాధించాలని వెల్లడించారు. కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్, ఇంటర్నెట్ తదితర అంశాల్లో పరీక్ష ఉంటుందని తెలిపారు. గ్రూప్‌ా1 ఉద్యోగాలకు ఈ నిబంధనలు వర్తించవని పేర్కొన్నారు.










