- పలు జిల్లాల్లో అరెస్టులు
- మానవహారాలు, కలెక్టరేట్ల ముట్టడి
- విజయవంతంగా ముగిసిన 36 గంటల ధర్నా
ప్రజాశక్తి- యంత్రాంగం, అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలపై ప్రభుత్వం రెండో రోజు నిర్బంధం ప్రయోగించింది. పలు జిల్లాల్లో అరెస్టులకు పాల్పడింది. పోలీసులతో జరిగిన తోపులాటలో పలువురు నాయకులు, అంగన్‌వాడీలు స్పృహ తప్పిపడిపోయారు. భీమవరం, విశాఖలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. 36 గంటల ధర్నాలో భాగంగా కలెక్టరేట్ల వద్దే అంగన్‌వాడీలు వంట, వార్పు కొనసాగించారు. రాత్రి అక్కడే బస చేశారు. ధర్నా ముగింపు అనంతరం కలెక్టరేట్ల ముట్టడి, మానవహారం నిర్వహించారు. అధికారులు వారి వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అది ఆరంభం మాత్రమేనని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అంగన్‌వాడీలు హెచ్చరించారు. అరెస్టు చేసిన వారందరినీ పోలీసులు ఆ తర్వాత విడుదల చేశారు.

భీమవరంలో అంగన్‌వాడీల పట్ల పోలీసులు జులం ప్రదర్శించారు. ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి బూటు కాళ్లతో తొక్కి కర్కశంగా వ్యవహరించారు. అసభ్యకర పదజాలాలతో దూషించారు. బారికేడ్లను అంగన్‌వాడీలకు అదిమిపెట్టారు. కాళ్లతో నొక్కిపెట్టి విచక్షణారహితంగా ప్రవర్తించారు. దీంతో, పలువురు యూనియన్ నాయకులు, అంగన్‌వాడీలు స్పృహ కోల్పోయారు. వందలాది మంది అంగన్‌వాడీలకు గాయాలపాలయ్యారు. దీంతో, ఆగ్రహించిన అంగన్‌వాడీలు బారికేడ్లను తోసుకుంటూ కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లి బైఠాయించారు. సుమారు నాలుగు గంటల పాటు ఆందోళన ఉధృతంగా సాగింది.
గుంటూరులో బారికేడ్లను తోసుకొని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. అంగన్‌వాడీల వద్దకు డిఆర్‌ఒ వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దీనికి ముందు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్ర 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెన్ఫిట్స్ కనీసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ ధర్నాకు వస్తున్న వారిపై ప్రభుత్వం బెదిరింపులు పాల్పడడం శోచనీయమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కేబ్‌నెట్ సమావేశంలో అంగన్‌వాడీల సమస్యలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరవధిక ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద 36 గంటల ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ర్యాలీగా వెళ్తున్న అంగన్‌వాడీలను జైలు రోడ్డు జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. 650 మందిని అరెస్టు చేసి పోలీస్ బ్యారెక్స్ కల్యాణ మండపానికి తరలించారు.
అనకాపల్లిలో పోలీసులకు, అంగన్‌వాడీలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వి.మాడుగులకు చెందిన సూర్యకళావతి, సరోజిని సృృహతప్పి పడిపోయారు. పలువురు అంగన్‌వాడీలను, సిఐటియు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అంగన్‌వాడీల పోరాటానికి ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి, టిడిపి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు మద్దతు తెలిపారు.

కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు భారీ ర్యాలీగా బయలుదేరిన అంగన్‌వాడీలను శ్రీకాకుళంలోని జ్యోతిబాఫూలే పార్కు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య చోటు చేసుకున్న తోపులాటలో యూనియన్ జిల్లా కోశాధికారి కల్యాణి స్పృహ కోల్పోయారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డి.సుధ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు సహా 70 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
వేలాది మంది సెలవులు పెట్టుకొని కలెక్టరేట్ వద్ద ధర్నా, వంట, వార్పుతో నిరసన తెలుపుతున్నా జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో అంగన్‌వాడీలు విజయనగరంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో, డిఎస్‌పి గోవిందరావు జోక్యం మేరకు ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శాంతకుమారి అక్కడికి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకొని వారి నుంచి వినతిపత్రం తీసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

ఏలూరులో వర్షంలో తడుస్తూనే అంగన్‌వాడీలు అందోళన కొనసాగించారు. అధికారులు స్పందించకపోవడంతో పోలీసు వలయాన్ని ఛేదించుకుని బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. దీంతో, జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణమూర్తి వారి వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. అంగన్‌వాడీల ధర్నాకు రెండో రోజు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. వారి న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బాపట్లలోని పాత బస్టాండ్ కూడలిలో అంగన్‌వాడీల మానవహారంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రమాదేవి మాట్లాడుతూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగించాలన్నారు. వైఎస్‌ఆర్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద ధర్నాలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఎ.గఫూర్ ప్రసంగించారు. విజయవాడలో జరిగిన ధర్నాకు ఎంఎల్‌సి కె.ఎస్.లక్ష్మణరావు, యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్ మద్దతు తెలిపి ప్రసంగించారు. పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల, రాయచోటి, చిత్తూరు, తిరుపతి, మచిలీపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, నరసాపురం, పార్వతీపురం, ప్రకాశం జిల్లా ఒంగోలులో అంగన్‌వాడీల ధర్నా ముగిసింది. అల్లూరి జిల్లాలోని పాడేరు, చింతూరు, రంపచోడవరం ఐటిడిఎల ఎదుట అంగన్‌వాడీలు బైఠాయించారు.

36 గంటల పోరాటానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు : సిఐటియు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
అంగన్‌వాడీలు తమ న్యాయమైన కోర్కెల సాధనకు 36 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధర్నాకు మద్దతుగా నిలిచిన పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు, కెఎస్ లక్ష్మణరావు, ఎపి ఎన్‌జిఒ, ఎల్‌ఐసి, పోస్టల్, సిఐటియు, దాని అనుబంధ సంఘాలు, రంగాల కార్యకర్తలందరికీ సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్ నరసింగరావు, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి బేబిరాణి, కె సుబ్బారావమ్మ వేర్వేరు ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.










