ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్ధులు, ఉపాధ్యాయులకు రెండో విడత ట్యాబులు ఇచ్చేందుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సిఎం గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి దశలో నాడు-నేడు పూర్తిచేసుకున్న పాఠశాలలకు డిసెంబర్ నాటికి ఐఎఫ్‌పి, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిని ఏర్పాటు చేసుకున్న పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా డిసెంబర్ నాటికి అందించాలని చెప్పారు. టోఫెల్‌పై ప్రతి రోజూ కనీసం అరగంటపాటు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. దీనివల్ల పిల్లలు క్రమంగా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్‌నేషనల్ బాకలారియేట్(ఐబి) సిలబస్ ప్రవేశపెడితే ప్రభుత్వ పాఠశాలలు దశ మరోస్థాయికి చేరుకుంటుందన్నారు. ఐబి సిలబస్ దశలవారీగా అమలు చేసే అంశంపైనా అధ్యయనం చేయాలని చెప్పారు. జూనియర్ కళాశాలలుగా మార్చేందుకు గుర్తించిన ఉన్నత పాఠశాలల్లో అవసరం మేరకు అదనపు తరగతి గదుల నిర్మాణం, తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. బడిపిల్లలకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా డబ్బు ఖర్చుచేస్తున్నామని, మెనూను మార్చి పిల్లలకు రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. రాగిజావ ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత తగ్గకూడదని చెప్పారు. ప్రతి రోజూ పిల్లలకు అందిస్తున్న ఆహారంపై పర్యవేక్షణ ఉండాలని, దీనివల్ల నాణ్యత ఎప్పటికీ నిలిచి ఉంటుందని తెలిపారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో బలహీనంగా, రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలపై శ్రద్ధపెట్టాలని ఆదేశించారు. వారికి మంచి పౌష్టికాహారం, మందులు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ గుల్జార్, పాఠశాల విద్య కమిషనర్లు ఎస్ సురేష్‌కుమార్, కాటమనేని భాస్కర్, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ నిధి మీనా, ఎపిఈడబ్ల్యూఐడిసి చైర్మన్ నాగార్జున యాదవ్, ఎండి దీవాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










