- తలసరి ఆదాయం రూ.2,19,518
- ఆరేళ్లలో రూ.లక్ష పెరుగుదల
- వ్యవసాయ రంగంలో 11.2 శాతం వృద్ధి
- కొత్త అంకెలు తయారుచేసిన ప్రణాళికశాఖ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర వృద్ధిపై ప్రణాళికశాఖ తాజా గణాంకాలను సిద్ధం చేసింది. ప్రస్తుత పరిస్థితులకు భిన్నంగా ఈ గణాంకాలున్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధి జాతీయ సగటు వృద్ధి కన్నా ఎక్కువగా నమోదైందని అధికారులు తేల్చారు. ఇక తలసరి ఆదాయం కూడా కేవలం ఆరేళ్ల కాలంలో రూ.లక్ష పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను ఒకట్రెండు రోజుల్లో శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుత ధరల మేరకు జిఎస్‌డిపి రూ.13,17,728 కోట్లుగా నమోదైనట్లు పేర్కొన్నారు. ఇది గతేడాది కన్నా 16.22 శాతం వృద్ధిగా ఉన్నట్లు తేల్చారు. అయితే అంతకు ముందు ఏడాది 18.50 శాతంగా వృద్ధి నమోదైనట్లు లెక్కల్లో చూపించారు.
మూడు కీలక రంగాలకు సంబంధించి సేవా రంగంలో అత్యధికంగా 20.52 శాతం వృద్ధి నమోదుకాగా, పారిశ్రామిక రంగంలో 16.36 శాతం వృద్ధి, వ్యవసాయ-అనుబంధ రంగంలో 13.18 శాతం వృద్ధి రికార్డయినట్లు చూపించారు. రాష్ట్రంలో వృద్ధి జాతీయ సగటు కన్నా ఎక్కువగా రికార్డయినట్లు చూపించారు. సేవా రంగంలో వృద్ధి జాతీయ సగటు 17.4 శాతం కన్నా రాష్ట్రంలో మూడు శాతాన్ని ఎక్కువగా నమోదైనట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో కూడా రాష్ట్రంలో 13.18 శాతం వృద్ధి కాగా, జాతీయ సగటు 11.2 శాతంగా, పారిశ్రామిక రంగంలో రాష్ట్ర వృద్ధి 16.36 శాతం కాగా, జాతీయ సగటు 13.9 శాతం మాత్రమేనని చూపించడం విశేషం.
తలసరి ఘనంగా...
రాష్ట్రంలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిపోయినట్లు చూపించారు. ప్రస్తుతం రూ.2,19,518 తేల్చారు. ఇది గతేడాది కన్నా 13.98 శాతం ఎక్కువగా వృద్ధి ఉన్నట్లు పేర్కొన్నా రు. 2016-17 నుంచి గమనిస్తే మొత్తం తలసరి ఆదాయం ఇప్పటివరకు రూ.లక్ష వరకు పెరిగినట్లు చూపించడం గమనార్హం. 2016-17లో రూ.1,20,676 ఉన్న తలసరి ఆదాయం ఇప్పుడు రూ.2.19 కోట్లు దాటడం గమనార్హం.











