Oct 02,2023 21:42
  • సేవ్‌ జర్నలిజం డే సందర్భంగా సదస్సులో వక్తలు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రాణవాయువు వంటిదని విజయవాడ సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపల్‌ చెన్నుపాటి దివాకర్‌బాబు అన్నారు. సేవ్‌ జర్నలిజం డేను పురస్కరించుకుని విజయవాడలోని గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (ఎపియుడబ్ల్యుజె) ఆధ్వర్యంలో 'రాజ్యాంగం విలువలు-ప్రజాస్వామ్యం-పత్రికా స్వేచ్ఛ' అనే అంశంపై సోమవారం చర్చా వేదిక జరిగింది. ఈ కార్యక్రమానికి ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దివాకర్‌బాబు మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని, రాజ్యాంగ విలువలు రక్షింపబడతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశమంతటా ప్రధాన మీడియా కార్పొరేట్ల చేతుల్లో ఉండటం పత్రికా స్వేచ్ఛకు ప్రమాదకరంగా పరిణమించిందన్నారు. ప్రజాస్వామ్య పాలనలో పౌరుల భాగస్వామ్యంతో క్రియాశీలకంగా వ్యవహరించాలని, దానికి పత్రికా రంగం ప్రాధాన్యత అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే రాజద్రోహం కాదని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి హింసను ప్రేరేపిస్తే రాజద్రోహం అవుతుందని పేర్కొన్నారు.

tulasidas


రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ విడదీయరానిదని, ప్రజల ప్రయోజనాలను పత్రికలు, పాత్రికేయులు కాపాడితే జర్నలిస్టుల కోసం ప్రజలు నిలబడతారని ప్రజాశక్తి ఎడిటర్‌ బి తులసీదాస్‌ పేర్కొన్నారు. రాజ్యాంగంపై జరిగే దాడిని తిప్పికొట్టడానికి ఒక వ్యక్తికానీ, ఒక సంఘంగా కానీ కాకుండా సమిష్టిగా కృషి చేయాలన్నారు. స్వాతంత్య్రోద్యమంలో భారతీయులందరూ కుల, మత, ప్రాంత, భాషా, జాతి భేదాలు లేకుండా ఒక్కటై పోరాడి బ్రిటీష్‌ వాళ్లను పారదోలారన్నారు.
ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ.. జర్నలిస్టులపై జరిగే దాడులను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై 25కు పైగా కేసులు నమోదయ్యాయని, ఆయా కేసులన్నింటినీ రద్దు చేయాలని అన్నారు. కరోనా సమయంలో మృతిచెందిన జర్నలిస్టులకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్‌, ఐజెయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్‌కుమార్‌, ఎపియుడబ్ల్యుజె ఉపాధ్యక్షులు కంచెర్ల జయరాజ్‌, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మరాజు చలపతిరావు, ఆర్‌ వసంత్‌, యూనియన్‌ విజయవాడ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు ప్రసంగించారు.