Jun 19,2022 12:22

ఒక ఏనుగు కడుపునిండా చెరుకు గడలు తిని, తన పిల్లలకోసం తీసుకెడుతోంది. చిట్టీ అనే చిలుక ఎగురుతూ వచ్చి ఏనుగుపై కూర్చుంది. దారిలో ఒక నక్క ఎదురు వచ్చింది.
'ఏనుగన్నా! పిల్లలకోసం చెరుకు గడలు తీసుకెడుతున్నట్లున్నావు. ఏరోజైనా మన మృగరాజుకు చెరుకు గడలు తీసుకెళ్లిచ్చావా? సింహం ఏ రోజూ చెరుకు రసం రుచిచూసి ఉండదు. ఒకసారి ఇచ్చి చూడు. సింహం దగ్గర నీకు మంచి గుర్తింపు లభిస్తుంది.' అని నక్క సలహా ఇచ్చింది.
'అలాగే ఇప్పుడే వెళ్లి మృగరాజుకిస్తాను. చెరుకు రుచి చూపిస్తాను.' అని ఏనుగు సింహం గుహవైపు బయలుదేరింది.
చిలుక ఏనుగుతో 'అన్నా! నీ పిల్లల ఆకలి ముఖ్యం. మృగరాజు సంగతి మనకెందుకు? చెరుకులు నీ పిల్లలకివ్వు. సంతోషంగా తింటాయి' అని చెప్పి ఎగిరిపోయింది.
ఏనుగు చిలుక మాటలు వినకుండా చెరుకు గడలతో సింహం వద్దకెళ్లింది. సింహం కోపంగా చూసి 'మాంసం తినే నేను చెరుకు తినే దద్దమ్మలా కనిపిస్తున్నానా?' అంటూ తిట్టి పంపింది. ఏనుగు అవమానంతో వెళ్లిపోయింది.
ఒకరోజు సింహానికి జబ్బు చేసింది. తలనొప్పితో బాధపడుతోంది. వైద్యంచేసే కోతిని రమ్మని పావురంతో కబురంపింది సింహం. పావురం కోతికి విషయం చెప్పి వెళ్లిపోయింది. కోతి కొమ్మకు తగిలించి ఉన్న వైద్యం సంచిని తీసుకుని. చెట్టుదిగి పది అడుగులు వెళ్లగానే కోతికి నక్క ఎదురైంది.
'కోతిమామా! ఎక్కడికి వెళ్తున్నావూ?' అని అడిగింది. విషయం చెప్పింది కోతి.
'సింహం నుండి కబురు రాగానే పరుగెత్తి వెళ్లి వైద్యం చేస్తే నీ విలువ, అవసరం తెలియకుండా పోతుంది. ఆలస్యంగా వెడితే నీ అవసరం తెలిసొచ్చి, విలువ పెరుగుతుంది' అని సలహా ఇచ్చింది నక్క.
కోతి వెనుదిరిగి వచ్చి, సంచిని చెట్టు కొమ్మకు తగిలించి కూర్చుంది. చెట్టుపై ఉన్న చిట్టీ చిలుక ఇది గమనించి 'కోతి మామా! సింహం దగ్గరకు వెళ్లకుండా తిరిగి వచ్చావేం?' అని అడిగింది.
కోతి నక్క చెప్పిన మాటలు చెప్పి, 'రెండోసారి కబురువస్తే వెళ్తాను. సింహానికి నా గొప్పతనం, అవసరం అర్థమవుతుంది' అంది కోతి.
'ఆరోగ్యం బాగలేక బాధపడుతుంటే ఆలస్యం చేయడం మంచిది కాదు. ఇప్పుడు నీ గొప్పతనానికి వచ్చిన లోటు ఏమీలేదు. అవసరానికి వెంటనే పలికినప్పుడే విలువ పెరుగుతుంది' అంది చిలుక.
కోతి ఆ మాటలు వినకుండా కాలు మీద కాలేసుకుని ఠీవిగా కూర్చుంది. కోతి ఎంతసేపటికీ రాకపోయేసరికి ఎలుగుబంటును పంపింది సింహం. ఎలుగుబంటు పావురం వచ్చి విషయం చెబితే రాకుండా ఠీవిగా, ఖాళీగా కూర్చుని ఉన్న కోతిని కోపంగా చూసి, నాలుగుదెబ్బలు తన్ని వెంట తీసుకెళ్లింది.
ఒకసారి చెట్టుకింద దిగులుగా కూర్చుని ఉన్న కాకిని నక్క చూసి కారణమడిగింది. 'నక్కబావా! చిలుకకు అందం, కోకిలకు పాట, నెమలికి నాట్యం, గిజిగాడికి అందమైన గూడుకట్టే నైపుణ్యం ఇలా ఏదో ఒక గుర్తింపు ఉంది. నాకు ఏ గుర్తింపూ లేదు. చాలా దిగులుగా ఉంది' అంది.
నక్క నవ్వి 'నువ్వూ పాడగలవు. నాట్యం చేయగలవు. నీకేం తక్కువ? పులి మంత్రికి ఆటపాటలంటే ఇష్టం. వెళ్లి నీ ప్రతిభను ప్రదర్శించు. మంచి బహుమతి పొందు. గుర్తింపు వస్తుంది' అని సలహా ఇచ్చి వెళ్లింది.
చెట్టుపైనున్న చిట్టీ ఈ మాటలు వింది. నక్క మాటలకు పొంగిపోయి, పులి వద్దకు బయలుదేరుతున్న కాకితో చిలుక 'నీవు పరిసరాలను శుభ్రం చేస్తావు. పిండిపదానం చేయడానికి నిన్ను మాత్రమే ఆహ్వానిస్తారు. కలిసిమెలిసి ఐక్యతగా ఉంటారనే పేరు మీకు ఉంది. ఈ గుర్తింపు చాలు. సాధన చేయకుండా, లేనిప్రతిభను ప్రదర్శించాలని పాకులాడకు' అంది.
చిట్టీ మాటలు వినకుండా పులి వద్ద తన పాట ఆట ప్రదర్శించి, చీవాట్లుతిని వచ్చింది కాకి.
'ఈ లోకంలో అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలిచ్చేవాళ్లకు లోటులేదు. ఆ సలహాలను విని, మంచిచెడ్డలు ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించకుండా అడ్డమైన తప్పుడు సలహాలను ఆచరిస్తే, అభాసుపాలై నష్టపోయేది మనమే' అనుకున్నాయి ఏనుగు, కోతి, కాకి.
 

- డి.కె. చదువులబాబు
94407 03716