Mar 24,2023 12:55

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఎక్కడపడితే అక్కడ వండుకోవడం.. వేటినైనా వండుకొని తినడం వంటివి డిస్కవరీ ఛానెల్స్‌లో మనం తరచూ చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చెక్క పాత్రల్లో వండుకోవడం, చెట్ల బెరళ్లు, ఆకులు ఇలా వాళ్లు వేటితోనైనా ఆహారాన్ని అప్పటికప్పుడు వండుకుని తింటుంటారు. ఆ వంటకాలను చూస్తే.. అయ్యో వీటిని తింటే ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహం కూడా రాకమానదు. సరిగ్గా ఈ కోవకు చెందినవే బాంబో షూట్స్‌ (వెదురు రెమ్మలు)తో తయారుచేసే వంటకాలు. చాలామందికి బాంబో చికెన్‌ గురించి తెలిసి ఉండొచ్చు. బాంబో షూట్స్‌తో రెసిపీస్‌ అంటే ఒకింత ఆశ్చర్యంగా ఉండొచ్చు. అయితే బాంబో షూట్స్‌ వంటకాల్ని తింటే ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. బాంబో షూట్స్‌ను ఆసియా దేశాల వంటకాల్లో ఉపయోగిస్తారు. చికెన్‌, మటన్‌, ఫిష్‌, కూరగాయలు ఇలా వేటితోనైనా బాంబో షూట్స్‌ని కలిసి వండుకొని తినొచ్చు. ఈ వంటకాలకు సంబంధించిన పలు వీడియోలు యూట్యూబ్‌ఛానెల్స్‌లో కనిపిస్తాయి. మరి వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..!

- బాంబో షూట్స్‌ వంటకాల్ని తింటే.. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే గుండెను రక్షించడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు.
- ఈ వంటకాలు కొవ్వుని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే చర్మం- ఎముకల ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
- బాంబో షూట్స్‌ వంటకాల వల్ల మలబద్ధక సమస్య తీరుతుంది. వెదురు రెమ్మల్లో ఉండే 4 శాతం సెల్యులోజ్‌ ప్రేగుల పెరిస్టాల్టిక్‌ కదలికను పెంచుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది.
- చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి సహాయపడే కీలకమైన ఖనిజాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. వెదురు రెమ్మల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తింటే అధికబరువు సమస్యను తగ్గించుకోవచ్చు.