తిరువనంతపురం : సుసంపన్నమైన వైవిధ్యంతో కూడిన సమాఖ్యవాదమే భారతదేశానికి పునాది అని, ముందుకు సాగేటప్పుడు దానిని గుర్తుంచుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడి సెంట్రల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయన్ మట్లాడుతూ 'కేవలం సమాఖ్య సూత్రాలను నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే గొప్ప వైవిధ్యం, సంస్కృతిని కలిగి ఉన్న దేశంగా మన స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకరం చేసుకోగలం' అని తెలిపారు. అన్ని భాషలు, సంస్కృతిని సమీకృతం చేసుకుంటూ దేశం ముందుకు సాగడం భారత జాతీయవాదంలోని అత్యంత అద్భుతమైన లక్షణమని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 'ఆ విధమైన దృకృథాన్ని ఆర్థిక రంగంలో కూడా కలిగి ఉండడం చాలా ముఖ్యమని మనం గ్రహించాలి. బలమైన కేంద్రం, తమ వాదనలను బలంగా వినిపించే రాష్ట్రాలు, స్థానిక సంస్థలు సమాఖ్య వ్యవస్థకు బలమైన పునాదిని ఏర్పరుస్తాయి' అని ముఖ్యమంత్రి చెప్పారు. అన్ని రాజ్యాంగ సంస్థలను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేవిధంగా కేంద్రం రుణ సామర్థ్యాన్ని పరిమితం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.










