Aug 05,2023 10:18

న్యూఢిల్లీ : దేశంలో పలు ప్రాంతాల్లో విద్వేష పొగ ఎగసిపడుతుంటే, కేరళ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అన్నారు. ఢిల్లీలో పునర్నవీకరించిన ట్రావెన్‌కోర్‌ ప్యాలెస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశమంతటా సాంస్కృతిక వైవిధ్యం తీవ్ర దాడికి గురవుతోందని, బహుళత్వాన్ని దెబ్బ తీసేందుకు ఎటువంటి దారుణాలకు పాల్పడుతున్నారో మణిపూర్‌లో చూస్తున్నామని అన్నారు. బహుళత్వం కేరళీయుల జీవితంలో భాగమని, అది ఇక్కడ ప్రతిబింబిస్తుందని అన్నారు. దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై తీవ్ర దాడులు జరుగుతుండడం బాధ కలిగిస్తోందని అన్నారు. మణిపూర్‌లో ఎగసిపడుతున్న విద్వేషపు చిచ్చు, దేశంలోని ఇతర చోట్ల జరుగుతున్న ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వీటిని రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు.