Mar 16,2023 07:14

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎమ్మెల్యేల కోటాలో ఏడుగురు అభ్యర్థులను శాసన మండలిలో ఏకగ్రీవంగా గెలిపించుకుంటామని ఊహించిన వైసిపికి ఇప్పుడు ఎవరో ఒక అభ్యర్థికి ఇబ్బంది ఏర్పడుతుందోమోన్న భయం వెంటాడుతోంది. అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వివిధ అంశాల్లో టిడిపికి అవకాశం ఇవ్వరాదన్న లక్ష్యంతో నలుగురు టిడిపి ఎమ్మెల్యేలను వైసిపి ప్రభుత్వం తన వైపునకు తిప్పుకోగలిగింది. దీంతో గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యేల కోటాలో ఎన్ని ఖాళీలు వచ్చినా వైసిపి సునాయసనంగా దక్కించుకుంటోంది. ఈ నేపధ్యంలో ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ఈనెలాఖరులో ముగియనుంది. ఏడుగురు వైసిపి అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయగా ఈనెల 13న టిడిపి నుంచి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా నామినేషన్లు వేశారు. దీంతో పోటీ అనివార్యం అయింది. ఎమ్మెల్సీగా గెలవాలంటే కనీసం 23 మంది ఎమ్మెల్యేల మద్ధతు అవసరం. టిడిపి నుంచి 23 మంది గెలుపొందినా నలుగురు వైసిపికి మద్దతు పలుకుతున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసిపిలోనూ అసమ్మతి ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుండటంతో టిడిపి వ్యూహాత్మకంగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీని రంగంలోకి తీసుకువచ్చింది. దీంతో వైసిపిలో ఓటమి బెడద ఏర్పడింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఎం జగన్‌ మంత్రులను రంగంలోకి దింపారు. ఒక్కో అభ్యర్థికి ఇద్దరు మంత్రులను కేటాయించారు. ఒక్కొ అభ్యర్థికి కనీసం 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. ఏడుగురు అభ్యర్థులకు 154మంది మద్దతు అవసరం. వైసిపి నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి అసమ్మతి గళం విన్పిస్తుండటంతో సంఖ్యాపరంగా వైసిపికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తానని ఆనం ఇప్పటికే అసెంబ్లీ లాబీల్లో మీడియాతో వ్యాఖ్యానించారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో కూడా ఇలాగే వేశామని తెలిపారు. వీరిద్దరూ టిడిపి అభ్యర్థికి మద్ధతు పలికితే వైసిపి ఇరకాటంలో పడుతుంది. టిడిపి ప్రస్తుతం ఉన్న 19మంది ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురిని సమీకరించుకోవాల్సి ఉంది. ఇప్పటికే కోటంరెడ్డి, ఆనం మద్దతు లభిస్తుందని ఊహిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వైసిపి నుంచి మరొకరు తమ వైపునకు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకు ఆనం, కోటంరెడ్డి సహకారం కూడా తీసుకుంటున్నారని తెలిసింది. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ తన ఓటు ఎవరికి వేస్తారన్నదీ ఆసక్తిగా మారింది. అటు టిడిపికి, ఇటు వైసిపికి ఒక్క ఓటు కీలకంగా మారిన నేపధ్యంలో ఆ ఒక్కరు ఎవరన్నదీ అసెంబ్లీ లాబీల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.