- నలుగురు దుర్మరణం, ఆరుగురికి తీవ్ర గాయాలు
ప్రజాశక్తి-ఎర్రగుంట్ల (కడప జిల్లా) : వైఎస్‌ఆర్ కడప జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని ప్రొద్దుటూరు సమీపంలో ఆర్‌టిసి బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కడప నగరం ఆజాద్ నగర్ కాలనీకి చెందిన పది మంది ప్రొద్దుటూరు నుంచి మల్లెల గ్రామంలోని దర్గా దర్శనానికి ఆటోలో బయలుదేరారు. ఎర్రగుంట్ల సమీపంలో ముందుగా వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్‌టిసి బస్సు ఢీ కొట్టింది. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఆటో నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో మహిళా డ్రైవర్ అమీనా(20)తోపాటు షాకీర్ (10), మహమ్మద్(25), హసీనా(25) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతంలో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని జమ్మలమడుగు డిఎస్‌పి నాగరాజు పరామర్శించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్‌కు తరలిస్తున్నామని తెలిపారు.
క్షతగాత్రులను పరామర్శించిన ఆర్‌డిఒ
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు క్షతగాత్రులను జమ్మలమడుగు ఆర్‌డిఒ శ్రీనివాసులు పరామర్శించారు. ప్రమాద ఘటన గురించి ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.











