ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్:అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్తు తీగలు తగిలి రైతు మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం ఎం బోయపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడవి పందుల బెడద నుంచి పంటలను కాపాడుకోవడానికి అదే గ్రామానికి చెందిన రైతు నాగభూషణం తన పొలంలోని కంచెకు విద్యుత్ వైర్లు ఏర్పాటు చేశారు. రైతు మేఘనాథం (39) తన పాడి ఆవు కనిపించకపోవడంతో వెతుకుంటూ శనివారం రాత్రి పొలం వద్దకు వెళ్లారు. పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలను చీకట్లో గుర్తించక వాటికి తగిలారు. దీంతో విద్యుదాఘాతానికి గురై మేఘనాథం అక్కడిక్కడే మరణించారు. ఆదివారం ఉదయం అటుగా వెళుతున్న కొందరు వ్యక్తులు దీనిపై గ్రామస్తులకు, తవణంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేసుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మేఘనాథానికి భార్య ఉంది. పిల్లలు లేరు.










