Oct 18,2023 21:26

ప్రజాశక్తి - మాచర్ల (పల్నాడు జిల్లా):అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కళ్లకుంట గ్రామానికి చెందిన నర్రవరపు అయ్యన్న (55) తనకున్న మూడు ఎకరాలతోపాటు మరో 12 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో పత్తి, మిర్చి పంటలను సాగు చేసేవారు. పంటల సాగు నిమిత్తం రూ.12 లక్షల వరకు అప్పు చేశారు. గత మూడేళ్లుగా వర్షాభావం, చీడపీడలతో పంట చేతికందకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. అప్పులు తీర్చే మార్గంలేక తాను సాగుచేస్తున్న పొలంలోనే పురుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు ఆయనను మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. అయ్యన్న గతంలో సర్పంచ్‌గా పని చేశారు. ఆయనకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వెల్దుర్తి ఎస్‌ఐ శ్రీహరి కేసు నమోదు చేశారు.