ఫొటోలలోని కంటి ప్రతిబింబాలను త్రీడి మోడల్స్‌గా మార్చడం అనేది ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్. వాస్తవానికి అందం చూసేవారి కళ్లలో ఉందంటారు. అయితే, చూసేవారిని ఎంతగా ఆకర్షిస్తారో దాని ప్రతిబింబం కూడా కంటిలో ఉంటుందని అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్‌కు చెందిన పరిశోధకులు. వీరు కంటి ప్రతిబింబాలను 3డి దృశ్యాలుగా మార్చారు. 2డి ఫొటోల నుండి పరిసరాలను పునర్నిర్మించగల ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత అయిన న్యూరల్ రేడియన్స్ ఫీల్డ్ (ఎన్‌ఇఆర్‌ఎఫ్) పై రూపొందించారు. కంటి ప్రతిబింబ విధానం ఏదైనా.. ఆచరణాత్మక అప్లికేషన్లను రూపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక్కోసారి ఫొటో దిగినపుడు కంటిలో ప్రతిబింబం అస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మనిషి కన్ను సమతులంగా ఉండటంతో ఈ ప్రతిబింబాలను అర్థం చేసుకోవడం కష్టతరం. అదే సమయంలో కంటిలోని కార్నియాలో ఆ ప్రతిబింబం పూర్తిగా పరుచుకుంటుంది. కార్నియాలో పరుచుకున్న ప్రతిబింబాలు తక్కువ రిజల్యూషన్‌తో అస్పష్టంగా ఉంటాయి. వాటిని 3డిలోకి మార్చి, స్పష్టమైన నమూనాను అందించేలా పరిశోధకులు ఓ అప్లికేషన్‌ను రూపొందించారు. తద్వారా ఫొటోగ్రాఫ్‌లో కన్నా స్పష్టంగా వస్తువు ప్రతిబింబాన్ని 3డిలో పొందవచ్చు. ఈ పద్ధతితో పరిశోధకులు పలు 3డి నమూనాలను రూపొందించారు. ఈ పరిశోధనతో ఒక్కోసారి నేరాలను కూడా శోధించవచ్చు. ఈ పరిశోధన వివరాలను ఎఆర్‌ఎక్స్‌ఐవి ప్రీ -ప్రింట్ సర్వర్‌లో ప్రచురితమైంది. అయితే ఇంకా సమీక్షించాల్సి వుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.