Sep 12,2022 09:42

ప్రజాశక్తి- యంత్రాంగం : కృష్ణంరాజు సినీ, రాజకీయ రంగాల్లో రాణించారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు..1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణరాజు జన్మించారు. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు. 1966లో 'చిలకా గోరింకా' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. హీరోగానూ, విలన్‌గానూ అలరించారు. ఉత్తమ నటనా ప్రతిభతో 1977, 1984 సంవత్సరాల్లో నంది అవార్డులు అందుకున్నారు. 1986లో 'తాండ్ర పాపారాయుడు' చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు లభించింది. 2006లో ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది జీవిత సాఫల్య పురస్కారం పొందారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1992లో రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణంరాజు కాంగ్రెస్‌ పార్టీ నుంచి నరసాపురం ఎంపిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత బిజెపిలో చేరి 1998, 1999లో నరసాపురం నుంచి విజయం సాధించారు. వాజ్‌పేయి మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖ, వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రిగా సేవలందించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో అదే స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన బిజెపిని వీడి మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి నుండి ప్రజారాజ్యం పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. తిరిగి బిజెపిలో చేరారు. స్వగ్రామమైన మొగల్తూరులో ఆయన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. హైదరాబాద్‌లోగల జూబ్లిహిల్స్‌లోని స్వగృహంలో ఉంచిన కృష్ణంరాజు పార్థివదేహానికి పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు నివాళులర్పించారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, మాజీ ఎంపి మోహన్‌బాబు, తెలంగాణ మంత్రులు కెటిఆర్‌, తలసాని శ్రీనివాస యాదవ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌, సినీనటులు సుమన్‌, మహేశ్‌బాబు, జూనియర్‌ ఎన్‌టిఆర్‌, అల్లు అర్జున్‌, గోపీచంద్‌, విజరు దేవరకొండ, బిజెపి నేతలు మురళీధరరావు, ఎంపి బండి సంజరు తదితరులు వారిలో ఉన్నారు. కృష్ణంరాజు సోదరుడి కుమారుడు ప్రభాస్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. తెలుగు సినీ పరిశ్రమలో 50 ఏళ్లుగా మిత్రులుగా కలిసి పనిచేశామని సూపర్‌ స్టార్‌ కృష్ణ అన్నారు. కృష్ణంరాజు మృతి చాలా బాధాకరమని పేర్కొన్నారు.
 

                                                                  తెలంగాణ, ఎపి సిఎంల సంతాపం

కృష్ణంరాజు మృతి పట్ల తెలంగాణ సిఎం కెసిఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ సిఎం జగన్మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు తన యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో నటించి విలక్షణ నటనా శైలితో రెబల్‌ స్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్నాయని, ఆయన మరణం తెలుగు వెండితెరకు తీరనిలోటని కెసిఆర్‌ పేర్కొన్నారు. సంతాపం తెలిపిన వారిలో ఎపి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి.మంగరాజు, కార్యదర్శి ఎన్‌.అనిల్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. కృష్ణరాజు అంత్యక్రియలకు ఎపి సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ విప్‌, నరసాపురం ఎమ్మెల్యే ఎం.నాగరాజ వరప్రసాద్‌ రాజు హాజరు కానున్నారు.
 

                                       కృష్ణంరాజు మృతి సినీ ప్రపంచానికి తీరనిలోటు : సిపిఎం ఎపి రాష్ట్ర కమిటీ

కృష్ణంరాజు మృతి పట్ల సిపిఎం ఎపి రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపం ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణంరాజు మృతి సినీ ప్రపంచానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.