Aug 21,2022 10:40

తెలుగు తెరకు ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతూనే ఉంటారు.. అలా కొత్తగా పరిచయమయ్యే వాళ్లలో మలయాళీ నటీమణుల జోరే ఎక్కువ. అందం, అభినయం విషయంలో తమ ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే కొందరు మలయాళీ నటులు స్టార్‌ హీరోయిన్ల రేసులో ఉంటే.. మరికొందరు ఇప్పుడిప్పుడే ఆ రేసులో నిలుస్తున్నారు. తాజాగా మరో నటి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆమే 'రజీషా విజయన్‌'. 'రామారావు ఆన్‌ డ్యూటీ' చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమె గురించిన మరిన్ని విశేషాలు..
రజీషా విజయన్‌ భారతీయ చలనచిత్ర నటి, ఆమె మలయాళ చిత్రాల్లో నటించింది. 'అనురాగ కరికిన్‌ వెల్లం' చిత్రంలో ఆమె తొలిసారిగా నటించారు. ఆమె అనురాగ కరికిన్‌ వెల్లమ్‌. ఇష్‌లో తన పాత్రకు 2016 రాష్ట్ర్ట ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. కాగా తమిళంలో 'కర్ణన్‌' చిత్రం ద్వారా ఆమె పరిచయమయ్యారు. ధనుశ్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా.. వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. రజీషా నటనకూ మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆమె సూర్య, కార్తీ సినిమాల్లో నాయిక పాత్రలను పోషిస్తూ ఉండటం విశేషం. ఈ రెండు సినిమాల్లోను ఆమె ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషిస్తున్నారు. కాగా ఇటీవల విడుదలైన 'రామారావు ఆన్‌ డ్యూటీ' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోనూ తన స్థానాన్ని నిలుపుకున్నారు.
మంచి కథ కోసం ఎదురుచూశా..
తమిళంలో తాను నటించిన కర్ణన్‌ చిత్రంతో తనకు మంచిపేరు వచ్చిందని.. ఆ మూవీతోనే తనకు 'రామారావు ఆన్‌ డ్యూటీ'లో నటించే అవకాశం వచ్చిందని చెప్పారు. అయితే గతంలోనే తనకు తెలుగులో ఆఫర్లు వచ్చినా.. వద్దనుకున్నానని తెలిపారు. మంచి కథ కోసం ఎదురుచూశానని.. ఆ అవకాశం ఈ సినిమాతో వచ్చిందని వివరించారు. కాగా దర్శకుడు శరత్‌ 'కర్ణన్‌' సినిమా చూసి, నాకు కాల్‌ చేసి 'రామారావు ఆన్‌ డ్యూటీ' ప్రాజెక్ట్‌ గురించి చెప్పారు. శరత్‌ కథను అద్భుతంగా చెప్పారు. ఒక భాషలో పరిచయమవుతున్నపుడు బలమైన కథ, పాత్ర కావాలని ఎదురుచూశాను. నేను ఎదురుచూసిన పాత్ర ఈ సినిమాతో దక్కింది. మాళిని పాత్ర చాలా అందంగా, బలంగా వుంటుంది. ఇంత మంచి సినిమాతో తెలుగులో పరిచయం అయ్యినందుకు ఆనందంగా వుంది.
ఇక్కడ థియేటర్స్‌.. ఆడియన్స్‌ ఎక్కువ..
తెలుగు నేర్చుకుంటా. త్వరలోనే తప్పకుండా డబ్బింగ్‌ చెబుతా. తెలుగులో చాలా సినిమాలు చేయాలని వుంది. తెలుగు డబ్బింగ్‌గా వచ్చిన నా ఇతర భాషల చిత్రాలనూ అభిమానించారు. ఇక్కడ ప్రేక్షకుల అభిమానం మర్చిపోలేను. పరిశ్రమలు వేరైనా అందరూ తీసేది సినిమానే. టెక్నిక్‌ ఒక్కటే. నటన కూడా ఒకటే. మిగతా పరిశ్రమలతో పోలిస్తే తెలుగులో సినిమాల్లో ఎక్కవ బడ్జెట్‌ వుంటుంది. పెద్ద క్యాన్వాస్‌లో సినిమాకు తెరకెక్కుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలని కలుపుకుంటే ఇక్కడ థియేటర్స్‌, ఆడియన్స్‌ ఎక్కువ.
అక్కడ స్క్రిప్ట్‌ ప్రధానం..
మలయాళంలో స్టార్‌ కాస్ట్‌, డైరెక్టర్‌, నిర్మాత కంటే స్క్రిప్ట్‌ చాలా ప్రధానం. బౌండ్‌ స్క్రిప్ట్‌ లేనిదే షూటింగ్‌ స్టార్ట్‌ కాదు. రచయితలు మొదట బలమైన స్క్రిప్ట్‌ని రాయడానికి ప్రయత్నిస్తారు. బహుశా అదో కారణం కావచ్చు. అయితే సినిమా అనేది అల్టిమేట్‌గా థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌. మమ్ముటి గారు ఒక సినిమా షూటింగ్‌ చేస్తున్నపుడు ఎలా వస్తుందో కనీసం మోనిటర్‌ కూడా చూడలేదు. కారణం అడిగితే.. 'నేను యాక్ట్‌ చేస్తుంది మానిటర్‌ కోసం కాదు.. బిగ్‌ స్క్రీన్‌పై ఎలా వుంటుందో అనేది చూస్తాను' అని చెప్పారు. థియేటర్‌ ఇచ్చే అనుభవం వేరు. కాగా తజాగా 'మలయంకున్జు' పాటు మరో నాలుగు మలయాళం సినిమాలు విడుదల కానున్నాయి. మరో రెండు సినిమాల షూటింగ్‌ మొదలుపెట్టాలి అంటూ ముగించారు.

vijayan



పేరు : 'రజీషా విజయన్‌'
పుట్టిన తేదీ : జులై 15, 1991
పుట్టిన ప్రాంతం : కోజీకోడ్‌, కేరళ
చదువు : గ్రాడ్యుయేషన్‌ ఇన్‌ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌.
హాబీస్‌ : రీడింగ్‌, ట్రావెలింగ్‌, డ్యాన్స్‌
తల్లిదండ్రులు : విజయన్‌, షీలా విజయన్‌
తోబుట్టువులు : అంజూషా విజయన్‌