Oct 09,2023 22:41
  • 25 నుండి బస్సు యాత్రలు
  • జనవరి నుండి పింఛను పెంపు
  • ఫిబ్రవరిలో మ్యానిఫెస్టో ప్రకటన
  • వైసిపి శ్రేణులకు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న కాలం ఎంతో కీలకమైంది...మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఎన్నికలు ఉండవచ్చు. నిరంతరం ప్రజల్లోనే వుండండి. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించండి.' అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైసిపి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన తమ పాలనలో చేపట్టిన పథకాలను సుదీర్ఘంగా వివరించారు. జనవరి ఒకటవ తేదీ నుండి 3 వేల రూపాయలకు పింఛను పెంచుతున్నట్లు చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్‌ 25వ తేది నుండి వైసిపి తరపున మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు నిర్వహించనున్నట్లు, ఫిబ్రవరిలో నూతన మ్యానిఫెస్టోను ప్రకటించి ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలిపారు. టిడిపి హయాంలో మేనిఫెస్టో అమలు చేయకుండా చంద్రబాబు చేసిన మోసాన్ని, బాబు అవినీతిని కూడా ఇంటింటిలో చెప్పాలని అన్నారు. ఈ 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించామన్నారు. మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులు, క్షేత్రస్థాయిలోకి పాలనను తీసుకెళ్లేందుకు గ్రామవార్డు సచివాలయాలు, సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు వలంటీర్‌ వ్యవస్థను తీసుకు వచ్చామన్నారు. ఇప్పటికే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమం చురుకుగా సాగుతోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 1.65 కోట్ల ఇళ్లను కవర్‌ చేశామన్నారు. ఆ తర్వాత నవంబర్‌ 1 నుండి వై ఎపి నీడ్స్‌ జగన్‌ పేరుతో ప్రజల మధ్యకు వెళ్లాలని అన్నారు. డిసెంబర్‌ 10వరకు కొనసాగే వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో భాగంగా నేతలు అంతా సచివాలయాలను సందర్శించాలని, పార్టీ జెండాలను ఆవిష్కరించాలని అన్నారు. ఆ తర్వాత అక్టోబర్‌ 25నుండి డిసెంబర్‌ 31 దాకా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ బస్సు యాత్రలను నిర్వహించాలన్నారు. సామాజిక న్యాయ యాత్రగా వీటిని నిర్వహించాలన్నారు. యాత్రలో భాగంగా ప్రతి రోజు మూడు ప్రాంతాల్లో బహిరంగ సభ నిర్వహించాలన్నారు. అలాగే డిసెంబర్‌ 11 నుండి జనవరి 15 దాకా ఆడుదాం ఆంధ్రా పేరుతో క్రీడా సంబరాలను నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో గుర్తింపునకు నోచుకోని నైపుణ్యం కలిగిన క్రీడాకారులను గుర్తించాలని తెలిపారు. జనవరి 1నుండి పెన్షన్‌ను రూ.3 వేలు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 10 నుంచి 20వ తేదీ దాకా వైఎస్సార్‌ చేయూత, జనవరి 20 నుండి 30వ తేదీదాకా ఆసరాను అందిస్తామన్నారు. పొదుపు మహిళలకు అందించే చేయూత, వైఎస్సార్‌ ఆసరాలను వివరించాలని కోరారు. ఫిబ్రవరిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తరపున కొత్త మ్యానిఫెస్టోను ప్రకటిస్తామని తెలిపారు. ఆ మ్యానిఫెస్టోతో ప్రజల వద్దకు వెళ్లాలని అన్నారు. ఎన్నికలకు ఇప్పటినుండే సన్నద్ధం కావాలన్నారు. రాబోయేది కురుక్షేత్ర యుద్ధమన్నారు. ఈ నాలుగేళ్లలో 2.7లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన అంశాన్ని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తెచ్చిన విప్లవాత్మకమైన మార్పులను వివరించాలన్నారు. ఇన్ని పనులు చేశాక మనకు ఎందుకు 175 స్థానాలకు 175 రావన్నారు. చంద్రబాబునాయుడును కక్షపూరితంగా అరెస్ట్‌ చేశారని మాట్లాడటం తగదని అన్నారు. తాను విదేశాల్లో వున్నప్పుడు అరెస్ట్‌ జరిగిందని చెప్పారు. ఆధారాలు వున్నందునే కోర్టు జైలుకు పంపిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

2

 

3