ఉత్తరాది తారలు ఓ వైపు బాలీవుడ్‌లో ప్రయత్నిస్తూనే టాలీవుడ్‌లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నారు. అలా వెబ్ సిరీస్‌లు, సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న మరో ఉత్తరాది నటి అనన్యరాజ్. 'సెవెన్ అవర్స్ టు గో', 'సిటీ ఆఫ్ డ్రీమ్స్'లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులో నాగార్జునతో 'ఘోస్ట్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు ఈ ఉత్తరాది తార. అలాగే నవీన్‌చంద్ర 'తగ్గేదే లే' చిత్రంలోనూ ముఖ్యపాత్ర పోషించారు. సినిమాల్లో నటించాలనే బలమైన కోరికతో పరిశ్రమలోకి అడుగుపెట్టి.. అనేక అవరోధాలను ఎదుర్కొన్నానంటూ అనన్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న విశేషాలు..
పేరు : అనన్య రాజ్
పుట్టిన తేదీ : 1998
పుట్టిన ప్రాంతం : గోరఖ్‌పూర్, ఉత్తరప్రదేశ్
నివాస ప్రాంతం : ముంబై
అనన్యరాజ్ భారతదేశ చలనచిత్ర నటి, మోడల్. ప్రధానంగా బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. 2016లో 'సెవన్ అవర్స్ టు గో' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అద్భుతమైన స్క్రీన్ పెర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకుటున్నారు. కాగా తాజాగా ఆమె తెలుగులోనూ నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు.. 'నేను పుట్టింది గోరఖ్‌పూర్‌లో, పెరిగింది ముంబైలో. స్కూలు, కాలేజీ ఫంక్షన్లలో తప్పకుండా పాల్గొనేదాన్ని. నటన కంటే డ్యాన్స్ ఇష్టం. ప్రీతిజింటా, రాణీ ముఖర్జీ వంటి నటీమణులను చూస్తూ పెరిగాను. ప్రీతి వ్యక్తిత్వం నాకు స్ఫూర్తి. చిన్నప్పటి నుంచీ నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడం ఇష్టం. కాబట్టే, ఇంటర్మీడియట్ పాస్ కాగానే యాక్టింగ్ స్కూల్లో చేరిపోయాను. నాటకాల్లో చేయడం మొదలుపెట్టాను. స్పష్టంగా పలకడం, పెద్దపెద్ద డైలాగులు చెప్పడం రంగస్థల కళాకారులకు ఇబ్బంది కలిగించే విషయాలు. కానీ, అవే నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. అక్కడి నుంచి మోడలింగ్ వైపు వచ్చాను. ఆ తర్వాత సినిమాల్లో ప్రయత్నించాను. మొదటి రెండేళ్లూ ఒక్క అవకాశం కూడా దొరకలేదు. చాలా ఇబ్బందిపడ్డాను' అని చెప్పుకొచ్చారు.
ఆ విషయంలో తెలుగు పరిశ్రమ ముందుంటుంది..
'ప్రతీ పరిశ్రమ దాని అవసరాలను బట్టి అవకాశాలు ఇస్తుంది. అయితే కొత్తవారిని ప్రోత్సహించడంలో తెలుగు పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. కొత్తగా రంగంలోకి వచ్చేవారికి టాలీవుడ్ ఒక వరం. భాష ఏదైనా ప్రామ్టింగ్ లేకుండా పదాలు స్పష్టంగా పలకగలను. అది సహజంగానే నాకు దక్కిన వరం.
తెలుగు భాష ఉచ్ఛరణ మొదట్లో కొద్దిగా కష్టంగా ఉండేది.. అయితే పట్టుదలతో కొన్నిరోజులు దానికి కేటాయించడం వల్ల అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా కొద్దిగా పట్టు సాధించాను. భాషా అవరోధం ఉన్నప్పటికీ దక్షిణాదిలో ఉత్తరాది నటీమణులు రాణిస్తున్నందుకు నేను వారిని అభినందిస్తున్నాను'.
అంత సులభమేం కాదు..
అందరూ అనుకుంటున్నట్టు, దక్షిణాదిలో పేరు తెచ్చుకోవడం అంత సులభమేం కాదు. భాష తెలియకుండానే రాణించిన కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను, తమన్నా నిజంగా గొప్పవాళ్లు. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేదే నా ఆశయం.
బాలీవుడ్‌కు, టాలీవుడ్‌కూ చాలా తేడా ఉంది. అక్కడ సెట్స్‌లో ఏదైనా వాగేస్తాం. ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోరు. ఇక్కడ మాత్రం కాస్త లౌక్యంగా ఉండాలి. ఆ ఒక్కటీ మినహాయిస్తే.. తెలుగు పరిశ్రమ చాలా నచ్చింది. ప్రపంచమంతా తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుంటున్న సమయంలో నేను టాలీవుడ్‌లో ఉండటం గర్వించాల్సిన విషయమే. 'తగ్గేదే లే' లో నేను ఓ ఎన్నారై అమ్మాయి పాత్ర పోషిస్తున్నా. హీరో నవీన్‌చంద్ హుషారైన నటుడు.
ఆమె కలను నేను నెరవేరుస్తున్నా..
బయోపిక్‌లు చేయాలని ఉంది. అదంత తేలికకాదని తెలుసు. అయినా తేలికైన పనులు చేస్తూ పోతే మనకంటూ ఏ ప్రత్యేకతా ఉండదు. నిజానికి మా అమ్మ నటి కావాలనుకుంది. కానీ తల్లిదండ్రులు ప్రోత్సహించలేదు. ఆమె కలను నేను నెరవేరుస్తున్నా. ప్రస్తుతం రెండు సినిమాలు, హాట్‌స్టార్ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా. ఒక మ్యూజిక్ ఆల్బమ్ కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళం, హిందీలో రాబోతున్న 'మద్రాసీ' అనే త్రిభాషా చిత్రంలో నటిస్తున్నా.
తెలుగులో ఎప్పుడో నటించాల్సింది..
'నటన అనేది చాలా కఠినమైన ప్రయాణం.. దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటిగా నా ప్రయాణం చిన్నదే అయినా, మంచి గుర్తింపు తెచ్చుకోగలననే నమ్మకం కలిగింది. వాస్తవానికి 2016లోనే తెలుగుచిత్ర పరిశ్రమలో ఒక పౌరాణిక చిత్రంలో ముఖ్యపాత్రలో నటించే అవకాశం వచ్చింది. అయితే అది కొన్ని కాపీరైట్స్ కారణంగా పూర్తి కాలేదు. జీవితంలో ఊహించని విషయాలు ఎన్నో జరుగుతాయి. నేనూ అదే నమ్ముతాను. అలా అనుకోకుండా నేను తెలుగులో నటించిన సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకున్నాను' అని వివరించారు.