Sep 16,2023 21:40

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌ (పల్నాడు జిల్లా) : నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి)తో విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యార్థినుల కన్వెన్షన్‌ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల లయోలా ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్‌ కో-కన్వీనర్‌ కె.నవత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రమాదేవి ప్రసంగించారు. విద్య, ఉద్యోగావకాశాలను మెరుగుపర్చాల్సిన విద్యావిధానం, అందుకు భిన్నంగా మహిళలను ఇంటికే పరిమితం చేసేలా ఉందన్నారు. మూడేళ్లపాటు డిగ్రీ కోర్సును చదివించడానికే తల్లిదండ్రులు ఆలోచిస్తున్న తరుణంలో ఎన్‌ఇపి పేరుతో నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థినులు ఉన్నత విద్యకు దూరమవుతారని తెలిపారు. ప్రేమ, వ్యామోహలకు గురిచేసే సినిమాలను బ్యాన్‌చేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలో సనాతన ధర్మంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని, మణిపూర్‌లో ఆడపిల్లలను నగంగా ఊరేగించి అత్యాచారం చేసి హత్యచేయడమే సనాతన ధర్మమా? అని ప్రశ్నించారు. చంద్రయాన్‌ విజయంలో వంద మంది మహిళా శాస్త్రవేత్తలు భాగస్వాములయ్యారని వివరించారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే, పోరాడే హక్కులున్నాయని, ప్రస్తుత పాలకులు ఆ హక్కులు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు నిర్బంధిస్తున్నారని, సమస్యలు పరిష్కారం కావాలంటే బానిసత్వానికి తలవంచకుండా పోరాటం చేయాలని కోరారు. ఆడపిల్లలపై హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రతి విద్యార్థిని మహిళా శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులు సిహెచ్‌ పావని, రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్నకుమార్‌, రాష్ట్ర కార్యదర్శి ఎం.అశోక్‌, లయోలా ఇంజనీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ ఈ.వంశీకృష్ణారెడ్డి, ప్రముఖ న్యాయవాది పిన్నమనేని పాములయ్య, ఐద్వా నాయకులు పాల్గొన్నారు.

sfi