ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్యజిల్లా) : మైనారిటీ విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష మానుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సర్వేపల్లి నరసింహ డిమాండ్ చేశారు. భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో సోమవారం జూనియర్ కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రి మెట్రిక్ స్కాలర్ షిప్ మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్‌లను కొనసాగించాలని కళాశాల ఎదుట నిరసన ఆందోళన చేశారు. ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యా రంగంలో సమూల మార్పులు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను చదువుకు దూరం చేసే విధంగా వారి ఫాసిస్టు ధోరణులు విద్యా వ్యవస్థపై అడుగడుగునా రుద్దుతున్నారన్నారు. అందులో భాగంగానే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న ఫ్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్‌లను ఎం.ఫిల్, పీ.హెచ్.డి చేసే విద్యార్థులకు మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్‌లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చాలా దుర్మార్గమైనదని అన్నారు. మైనారిటీలు విద్యలో వెనుకబాటుకు గురవుతున్నారని, చదువుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని అన్నారు. 2006 సంవత్సరంలో సచార్ కమిటీ నివేదిక ప్రకారం 2009లో మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది. కానీ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ శాస్త్రీయ విద్యను అటకెక్కించే విధంగా కాషాయీకరణను విద్యార్థుల వైపు రుద్దుతూ విద్యావ్యవస్థలు మార్పులు చేస్తోందని తెలిపారు. ఈనెల 8న కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటు సాక్షిగా సెక్యులర్ దేశమని, విద్యార్థులంతా సమానమని మేక వన్నె పులి మాటలు చెబుతూ మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్లు రద్దు చేస్తున్నామని చెప్పడం విడ్డూరమని అన్నారు. ఈ విధంగా పాలకవర్గాలు విద్యా వ్యవస్థలో తగిన నిధులు కేటాయించకుండా విద్యార్థులంతా సమానం అని చెబుతూ ఎం.ఫిల్, పి.హెచ్.డి చేసే విద్యార్థులు మొదలుకొని కింది స్థాయిలో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునే విద్యార్థుల వరకు మైనారిటీలకు స్కాలర్షిప్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి ఉంటే నెట్, సెట్, జె ఆర్ ఎఫ్ లతోపాటు విద్యార్థులకు వచ్చే వివిధ రకాల ఫెలోసిపుల శాతాన్ని పెంచి రీసెర్చ్ కేంద్రాలను యూజీసీ ద్వారా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం ఎం.ఏ.ఎన్.ఎఫ్ తిరిగి కొనసాగించాలని.. లేకపోతే దేశవ్యాప్తంగా పోరాటం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.










