- అంత్యక్రియలకు దిబ్బలను ఆశ్రయిస్తున్న దళితులు
- వరదలకు బయటపడుతున్న మృతదేహాలు
ప్రజాశక్తి- సీతానగరం(తూర్పుగోదావరి జిల్లా) : తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని ఏటిగట్టు పరిసర గ్రామాల్లో దళితులకు శ్మశాన వాటికలు కరువయ్యాయి. దీంతో, అంత్యక్రియలకు గోదావరి లంక దిబ్బలపైనే ఆధారపడుతున్నారు. ఇటీవల వచ్చిన గోదావరి వరదలకు మట్టి కొట్టుకుపోవడంతో పూడ్చిన మృతదేహాలు బయల్పడుతున్నాయి. ఆత్మీయులకు అంతులేని శోకాన్ని మిల్చుతున్నాయి. సీతానగరం మండలం పురుషోత్తపట్నం పంచాయతీ పరిధిలో పురుషోత్తపట్నం, రామచంద్రపురం గ్రామాలు న్నాయి. 1,291 మంది దళిత జనాభా ఉంది. పురుషోత్తపట్నంలో 591 మంది, రామచంద్రపురం లో 700 మంది నివసిస్తున్నారు. ఈ గ్రామాల్లో దళితులకు శ్మశనాలు లేవు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించిన ప్రాంతంలో వారు అంత్యక్రియలను నిర్వహించుకునేవారు. 2003లో పడవ మునిగి రామచంద్రపురం గ్రామానికి చెందిన 20 మంది మృతి చెందారు. వారి అంత్యక్రియలకు స్థలం లేక బాధితుల ఇళ్ల వద్ద మృతదేహాలు రెండు రోజులు ఉండిపోయాయి. శ్మశానం లేక మృతదేహాలను గోదావరి నది ఒడ్డున కుప్పగా ఒకే గోతిలో పాతిపెట్టారు. ఎత్తిపోతల పథకం నిర్మాణ సమయంలో శాశ్వత శ్మశానాన్ని ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఎత్తిపోతల పథకానికి కొద్దిదూరంలో గోదావరి నది ఒడ్డున మృతదేహాలను పూడ్చేందుకు నిర్మాణ సంస్థ మట్టిని తోలింది. అప్పటి నుంచి ఆ మట్టి దిబ్బల్లోనే మృతదేహాలను పూడ్చు తున్నారు. ఇటీవల వచ్చిన గోదావరి వరదలకు మట్టి కొట్టుకుపోయి మృతదేహాలు బయట పడ్డాయి. గతంలోనూ వరదల సమయంలో ఇదే పరిస్థితి ఉంది. అంత్యక్రియలు పూర్తి చేసిన బంధువులు బయటపడిన మృతదేహాలను చూసి లబోదిబో మంటున్నారు. మృతదేహాలు బయటపడడంతో భయాందోళనలకు గురవుతున్నామని కొంతమంది గ్రామస్తులు తెలిపారు. ఎన్నోసార్లు స్థానిక నాయకు లకు, జిల్లా స్థాయి అధికారులకు విన్నవించినా శాశ్వత పరిష్కారం చూపలేదని వాపోయారు.
పెత్తందారుల చేతుల్లో శ్మశాన భూమి
గ్రామస్తుల వినతుల మేరకు పురుషోత్తపట్నం లో సర్వే నంబరు 4/2లో ప్రభుత్వ భూమిని దళితుల శ్మశానం కోసం 2021లో అధికారులు కేటాయిం చారు. ఆ భూమి గ్రామ పెత్తందారులు కరుటూరి రాజేష్, చల్లమళ్ల సుజీరాజు, పెందుర్తి దీపక్ కబ్జాలో ఉంది. వీరు ఆ భూమిని ఇవ్వకుండా శ్మశాన వాటిక ఏర్పాటును అడ్డుకుంటున్నారు. దీంతో, వీరిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది.
సమాధులు కొట్టుకుపోతున్నాయి
శ్మశానం లేక గోదావరి నదీ గర్భంలో ఉన్న మెరకపై మృతదేహాలను పూడుస్తున్నాము. ఏటా వరదల సమయంలో సమాధులు కొట్టుకుపోతున్నాయి. గతంలో ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా ఉన్న సుమిత్ కుమార్‌గాంధీ రెండున్నర కుంచాల భూమిని శ్మశానం కోసం కేటాయించారు. రాజకీయ నాయకుల జోక్యంతో అది నేటికీ అందుబాటులోకి రాలేదు.
సకిలే భీమరాజు, సామాజిక కార్యకర్త, రామచంద్రపురం, సీతానగరం మండలం
శ్మశానం ఏర్పాటును అడ్డుకుంటున్నారు
శ్మశానం కోసం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాను. జాతీయ ఎస్‌సి కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లాను. మూడు నెలల్లో శ్మశానాలకు స్థలం చూపించాలని 2020 జనవరి 18న కలెక్టర్ కార్యాలయానికి హైకోర్టు, ఎస్‌సి కమిషన్ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికీ శ్మశానం ఏర్పాటు చేయకుండా అవరోధాలు సృష్టిస్తున్నారు.
- బర్రే ఆనంద్ కుమార్, రూల్ ఆంధ్రా మూమెంట్ అధ్యక్షుడు, రాజమహేంద్రవరం










