Aug 21,2023 16:37

న్యూఢిల్లీ : మహిళా, శిశు అభివృద్ధి శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రభుత్వ అధికారి ప్రేమోదరు ఖాఖా తన స్నేహితుని మైనర్‌ కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 2021లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ అధికారిని ఢిల్లీ పోలీసులు సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన ప్రభుత్వ అధికారి ప్రేమోదరు ఖాఖా తన స్నేహితుడి మైనర్‌ కుమార్తెపై అక్టోబర్‌ 2020 నుంచి 2021 జనవరి వరకు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో పధ్నాలుగేళ్ల ఆ అమ్మాయి గర్భందాల్చింది. దీంతో ఖాఖా భార్య ఆ గర్భం పోయేందుకు యువతికి అబార్షన్‌ మాత్రల్ని ఇచ్చింది. ఈ ఘటనలో ఖాఖా భార్య కూడా భాగస్వామ్యం కావడంతో ఢిల్లీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ ఈ ఘటనపై స్పందించింది. ఇప్పటివరకూ ఈ అధికారిని అరెస్టు చేయకపోవడమే అత్యంత దారుణమైన విషయంగా ఆప్‌ పేర్కొంది. ఇక ఈ సందర్భంగా ఆప్‌నేత సౌరభ్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ.. 'అధికారి చేసింది చాలా సిగ్గుమాలిన చర్య. ఈ ఘటనలో అధికారికి అతని భార్య కూడా సపోర్ట్‌ చేయడం చాలా దారుణం. ఈ ఘటన సమాజాన్ని వణికిస్తోంది. చట్టప్రకారం ఆ అధికారిని కఠినంగా శిక్షించాలి' అని ఆయన అన్నారు. అలాగే తక్షణమే ఖాఖాను విధుల నుంచి తొలగించాలని ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు.
కాగా, ఖాఖా స్నేహితుడు అక్టోబర్‌ 2020లో మృతి చెందాడు. దీంతో స్నేహితుని కుమార్తెకు ఖాఖా తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు. ఈ క్రమంలోనే ఆ బాలికపై ఖాఖా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ అమ్మాయి 2021 జనవరిలో తన తల్లి దగ్గరికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇంటర్‌ చదువుతున్న ఆ అమ్మాయి ఆందోళనకు గురై స్టీఫెన్స్‌ ఆసుపత్రిలో చేరింది. అప్పుడు ఆ అమ్మాయి లైంగిక వేధింపులకు, అత్యాచారానికి గురైనట్లు కౌన్సిలర్‌కి తెలిపింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీ కమిషనర్‌ ఫర్‌ ఉమెన్‌ (డిసిడబ్య్లు) చీఫ్‌ స్వాతి మలివాల్‌ ఆ అధికారిని వెంటనే అరెస్టు చేయాలని నోటీసులు జారీ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఖాఖాను అదుపులోకి తీసుకున్నారు.