Mar 25,2023 09:24
  • సిసిఎల్‌ లీగ్‌లో ఫైనల్‌కు చేరిన భోజ్‌పురి దబాంగ్స్‌

ప్రజాశక్తి - పిఎం.పాలెం, ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖ నగరంలోని ఎసిఎ - విడిసిఎ క్రికెట్‌ స్టేడియంలో సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (సిసిఎల్‌) సెమీ ఫైనల్స్‌ నేపథ్యంలో శుక్రవారం సినీ తారల సందడి నెలకొంది. తమ అభిమాన తారాగణాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మొదటి సెమీ ఫైనల్‌ పోటీలో ముంబయి హీరోస్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన భోజ్‌పురి దబాంగ్స్‌ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి హీరోస్‌ మొదటి ఇన్సింగ్స్‌ 10 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేయగా భోజ్‌పురి దబాంగ్స్‌ మొదటి ఇన్నింగ్స్‌ 10 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేయడంతో ముంబయి హీరోస్‌కు 29 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ముంబయి హీరోస్‌ 9.5 ఓవర్లలో 62 పరుగులకు ఆలౌటై భోజ్‌పురి దబాంగ్స్‌కు 92 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌కు 92 పరుగులు అవసరమైన తరుణంలో చివరి బంతి వరకు పోరాడిన భోజ్‌పురి దబాంగ్స్‌ చివరి బంతికి అజ్గర్‌ సిక్స్‌ కొట్టడంతో విజయం సాధించింది. దీంతో భోజ్‌పురి దబాంగ్స్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది.
 

                                       కొనసాగుతున్న తెలుగు వారియర్స్‌, కర్ణాటక బుల్డోజర్స్‌

అనంతరం తెలుగు వారియర్స్‌, కర్ణాటక బుల్డోజర్స్‌ మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక బుల్డోజర్స్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేయగా కడపటి వార్తలందేసరికి తెలుగు వారియర్స్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 2.2 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఒక వికెట్‌ నష్టపోయి 22 పరుగులు చేసింది. విక్టరీ వెంకటేష్‌, శ్రీకాంత్‌, విశ్వక్‌సేన్‌ తదితరులు స్టేడియంలో సందడి చేశారు.