- టివి చర్చలో పరస్పర విమర్శలు
బ్రసీలియా : బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బొల్సనారో విడ్‌ను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమయ్యారని, అమెజాన్ అడవులను ధ్వంసం చేసేందుకు అనుమతిస్తున్నారని వామపక్ష అభ్యర్ధి లూలా డసిల్వా విమర్శించారు. ఈ నెల 30న అధ్యక్ష ఎన్నికల రెండో రౌండ్ జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం జరిగిన మొదటి చర్చ సందర్భంగా పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఈ చర్చ టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది. చిన్నపాటి నియంతలా బోల్సనారో వ్యవహరిస్తున్నా రంటూ లూలా విమర్శించారు. ''వైరస్ ప్రమాదాల గురించి తక్కువగా అంచనా వేశారు. పరిస్థితి ఎలా వుందో గణాంకాలే చెబుతున్నాయి. బూటకపు వార్తలకు రారాజు లాంటి మీరు సమాజానికి అందించేవన్నీ అసత్యాలే. వ్యాక్సిన్ గురించి చెప్పినవన్నీ అబద్ధాలే. దేశంలో అధిక సంఖ్యలో కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.'' అని లూలా పేర్కొన్నారు. బోల్సనారో తన చర్యలను సమర్ధించుకున్నారు. 50కోట్ల డోసులను తీసుకొచ్చామని చెప్పారు. వ్యాక్సినేషన్‌లో బ్రెజిల్ అత్యుత్తమ ఉదాహరణగా నిలిచిందన్నారు. దేశానికే పెద్ద అవమానకరంగా లూలా నిలిచారని, కుంభకోణాలు జరిగాయని అన్నారు.










