Apr 21,2023 09:03

న్యూఢిల్లీ : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కరోనా బారిన పడ్డారు. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో గురువారం నాడు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. భారత వాయుసేన కమాండర్ల సమావేశంలో గురువారం ఆయన పాల్గొనాల్సివుంది. కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో ఈ కార్యక్రమానికి మంత్రి దూరంగా ఉన్నారు. చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండేతో కలిసి ఆర్మీ కమాండర్స్‌ కాన్ఫరెన్స్‌లో మంత్రి బుధవారం పాల్గొన్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో 12,591 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 40 మంది మరణించారు. గత ఎనిమిది నెలల్లో ఇంత భారీ సంఖ్యలో కేసులు వెలుగుచూడటం ఇదే మొదటిసారి.