Oct 07,2023 21:26
  • తహశీల్దార్‌ కార్యాలయం వద్ద స్నానం, వంటావార్పు, నిద్ర

ప్రజాశక్తి - చిలమత్తూరు : ఇళ్ల పట్టాల కోసం శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అధికారుల తీరును నిరసిస్తూ గత 20 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో పేదలు వేసుకున్న గుడిసెలను మూడురోజుల క్రితం రెవెన్యూ అధికారులు తొలగించారు. దీనిని నిరసిస్తూ శనివారం ఉదయం తహశీల్దార్‌ కార్యాలయం వద్దకు పేదలు చేరుకుని అక్కడే స్నానాలు చేసి నిరసన తెలిపారు. మధ్యాహ్నం వంటావార్పు నిర్వహించి కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా వ్యకాసం జిల్లా అధ్యక్షులు ఫిరంగి ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని 20 రోజులుగా పేదలు అనేక రూపాల్లో నిరసన తెలుపుతున్నా అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంభించడం సరికాదన్నారు. అసత్య హామీలు ఇచ్చి పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్న తహశీల్దార్‌పై కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం గుడిసెలను తొలగించి, కాల్చివేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రి తహశీల్దార్‌ కార్యాలయం వద్దే కుటుంబసభ్యులతో కలిసి నిద్రించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లక్ష్మీనారాయణ, రామచంద్ర, కమిటీ సభ్యులు చంద్ర, శివ, సదాశివరెడ్డి, రహంతుల్లా, మణిస్వామి, పేదలు పాల్గొన్నారు.