Oct 15,2023 21:01

ప్రజాశక్తి - పొందూరు (శ్రీకాకుళం):అక్రమంగా అరెస్టు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎక్కువ రోజులు జైల్లో ఉంచి ఆయన ఆరోగ్యాన్ని, టిడిపిని దెబ్బతీయాలని వైసిపి ప్రభుత్వం కుట్ర పన్నిందని ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం పొందూరు మండలం కృష్ణాపురంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చందబ్రాబుపై రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారని, జాతికి మంచి చేసే నాయకుడిని కాపాడుకునే ఉద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై పోరాటం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారని, బరువు తగ్గడంతో పాటు చర్మ సంబంధ సమస్యలు తలెత్తడం ద్వారా ఆయన్ను ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టాలనే ప్రభుత్వ ఆలోచనను తిప్పికొట్టాలని కోరారు. దీన్ని న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ మాట్లాడుతూ చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సాధు పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ వైసిపి ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నించే వారిని ఇబ్బందులకు గురిచేసి, వారి గొంతులను నొక్కుతున్నారని విమర్శించారు. సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు, మండల అధ్యక్షుడు చిగిలిపల్లి రామ్మోహన్‌, తెలుగు యువత జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మెండ దాసునాయుడు, బలగ శంకరభాస్కరరావు, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ లోలుగు వెంకట్‌ పాల్గొన్నారు.