చిట్టి, చిన్నోడు అక్కా తమ్ముళ్ళు. వారి ఇంటి పక్కన ఇసుకలో రోజూ ఆడుకునేవారు. ఇసుకలో గుళ్ళు కట్టుకుంటూ ఆనందించేవారు. ఓ రోజు ఇసుకలో చిట్టి గుడి కడుతుండగా చిన్నోడు 'చిట్టెక్కా నీ గుడి కంటే నాదే బాగుంది కదూ' అన్నాడు. చిట్టి నవ్వుతూ 'అవును నీ గుడే చాలా బాగుంది' అంది. ఇంతలో ఓ చీమ చిట్టి చేతి మీదికి ఎక్కింది. చిట్టి దాన్ని నలిపేస్తున్నంతలో చీమ ఇలా అంది 'చిట్టీ.. చిట్టీ. నన్నేమీ చేయకూ.. నేను మీతోనే ఉంటాను' అంది. అది చూసి చిన్నోడు 'పోనీలే అక్కా, మనతో ఉండనిద్దాంలే' అన్నాడు.
'నాకు ఇల్లు లేదు. నేను ఎండకు, వానకు, గాలికి తట్టుకోలేకపోతున్నాను. మీ ఇంట్లో తల దాచుకోనిస్తారా' అంది చీమ వారితో.
దానికి చిట్టి, చిన్నోడు 'సరే నువ్వు కూడా మాతోరా' అన్నారు. చిట్టి, చిన్నోడు చీమను తమతో పాటు ఇంటికి తీసుకెళ్ళారు.
'ఈ ఇంటిలో నేను ఏదైనా ఓ చిన్న రంధ్రంలో దాక్కుంటాను. నాకు ఆహారంగా ఏమైనా ఇస్తారా' అంది చీమ.
'సరే, ఆ వాకిలి పక్కన చిన్న రంధ్రం ఉంది. అక్కడికి వెళ్ళు. ఆ రంధ్రంలో ఉండు' అన్నాడు చిన్నోడు. చీమ బిరా బిరా ఆ రంధ్రంలోకి వెళ్ళిపోయింది.
'ఇక ఆడింది చాలు. రండి భోజనం చేద్దురుగాని' అంది తల్లి.
'ఆ వస్తున్నామమ్మా' అన్నారు ఇద్దరూ. చిట్టి, చిన్నోడు కొన్ని బియ్యపు గింజలు తెచ్చి ఆ రంధ్రం దగ్గర వేశారు. అది పైకి వచ్చి ఓపికగా అన్నింటినీ రంధ్రంలోకి తీసుకెళ్ళింది. ప్రతిరోజూ ఇదే పని చేసేవారు. చీమ కూడా బియ్యం తీసుకెళ్ళి దాచేది. చీమతో చక్కటి కాలక్షేపం అయేది ఇద్దరికీ. వేసే బియ్యం అది తీసికెళుతుంటే కేరింతలు కొట్టేవారు.
ఓ రోజు అన్నం చేద్దామంటే బియ్యం లేవు. 'అయ్యో ఇప్పుడు ఎలా.. బియ్యం లేవే! బయటకు వెళ్ళి తెద్దాం అనుకుంటే ఒకటే వర్షం కురుస్తోంది. ఇప్పుడు పిల్లలకు ఏం పెట్టాలి..?' అని దిగాలుగా ఉంది అమ్మ.
చిట్టి, చిన్నోడు 'ఏమైందమ్మా?' అన్నారు. 'బియ్యం అయిపోయాయి. తీసుకొద్దామంటే బయట వర్షంగా ఉంది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను' అంది.
'సరేలే అమ్మా, ఒక్కరోజు అన్నం లేకపోతే ఏంలే' అంది చిట్టి. ఆ రోజు బియ్యం వేయలేదు చీమకు. అది బయటకు వచ్చి అటూఇటూ చూస్తుంటే 'చీమా చీమా! ఈరోజు నీకు ఆహారం లేదు, మాకూ ఆహారం లేదు.. బియ్యం అయిపోయాయి' అన్నాడు చిన్నోడు.
దానికి చీమ 'అయ్యో అలాగా! నువ్వేమీ కంగారుపడకు. నేనున్న చోట కొద్దిగా రంధ్రం పెద్దది చేయి. ఆ రంధ్రంలో నేను బియ్యం దాచాను. ఓపికగా తీసుకోండి' అంది.
'నిజమా?' అన్నాడు చిన్నోడు. వెంటనే ఆ విషయం చిట్టికి, అమ్మకు చెప్పాడు. వారు ఆ రంధ్రం పెద్దది చేసి, కావాల్సినంత బియ్యం తీసుకున్నారు. బియ్యం చూసి 'భలే..భలే చాలా బాగుంది. ఈ చీమ మనకెంతో ఉపకారం చేసింది' అన్నాడు చప్పట్లు కొడుతూ.
చీమ దాని బరువు కంటే ఎనిమిది రెట్లు బరువును మోయగలదని వాళ్ళ టీచరు చెప్పిన విషయం గుర్తొచ్చింది చిట్టికి. 'అవును చీమ నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. చీమా, నీకు కృతజ్ఞతలు' అంది చిట్టి.
వెంటనే చీమ 'మీకే నేను కృతజ్ఞతలు చెప్పాలి. మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు. లేకపోతే ఎక్కడ ఉండేదానినో మీ సహాయంతో పోలిస్తే, ఈ చిన్ని సహాయం ఏ పాటిది' అంది.
చిట్టి, చిన్నోడు చీమకు చేసిన సహాయానికి తల్లి ఎంతో సంతోషించింది. ఆ రాత్రికి చక్కటి భోజనం చేసింది తల్లి. చీమతో సహా అందరూ ఆనందంగా గడిపారు.
కనుమ ఎల్లారెడ్డి
yellareddyk999@gmail.com