Apr 14,2023 09:47
  • క్వింటాలుకు రూ.మూడు వేలు తగ్గుదల

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గత వారం రోజులుగా మిర్చి ధరల పతనం కొనసాగుతోంది. క్వింటాలుకు రూ.మూడు వేల వరకు ధరలు పతనమయ్యాయి. సాధారణ రకాలు కనిష్ట ధర క్వింటాలు రూ. తొమ్మిది వేలు, గరిష్ట ధర రూ. 24 వేలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. గత నెలలో ఇదే రకం కనిష్టంగా రూ.12 వేలు, గరిష్టంగా రూ.27 వేలు పలికింది. మేలు రకాలైన తేజ, బాడిగ, దేవనారు డీలక్స్‌్‌ రకాల ధరలు గత నెలలో కనిష్టంగా రూ.13 వేలు, గరిష్టంగా రూ.30 వేల వరకు పలికాయి. ప్రస్తుతం కనిష్టంగా రూ.9500, గరిష్టంగా రూ.25 వేల వరకు ఉన్నాయి. నాణ్యత లేదనే సాకుతో వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. గుంటూరు మిర్చి యార్డుకు గురువారం 1,25,628 టిక్కిలు రాగా పాత నిల్వలతో కలిపి 1,27,324 టిక్కిలు విక్రయం జరిగాయి. ఇంకా 88,490 టిక్కిలు యార్డులో నిల్వ ఉన్నాయి.కొత్త సరుకు రావడం ప్రారంభం అయిన తరువాత గత మూడు నెలల కాలంలో నాలుగు దఫాలుగా కురిసిన అకాల వర్షాలతో నాణ్యత తగ్గిందని వ్యాపారులు కుంటిసాకు చెబుతున్నారు. విదేశీ ఆర్డర్లు కూడా గత 15 రోజులుగా నిలిచిపోయాయి. మరో 20 రోజుల వరకు ఆర్డర్లు ఉండే అవకాశం లేదని, బంగ్లాదేశ్‌కు ఆర్డర్లు నిలిచిపోవడం వల్ల ఇబ్బంది ఏర్పడిందని మిర్చి యార్డు చైర్మన్‌ ఎం. సుధాకర్‌ రెడ్డి తెలిపారు. క్వింటాలుకు రూ.మూడు వేలు వరకు తగ్గినా కనిష్టంగా రూ.14 వేలు, గరిష్టంగా రూ.17 వేలు వస్తుందన్నారు. ఎకరాకు కనీసం 15 క్వింటాళ్ల దిగుబడి రావాలని, క్వింటాలు రూ.20 వేలు తగ్గకుండా ఉంటేనే కొంత వరకు నష్టాల నుంచి బయటపడతామని రైతులు చెబుతున్నారు. ధరలు తగ్గిన నేపధ్యంలో రూపాయికి నాలుగు పైసలు పన్ను, రవాణా చార్జీలు మొత్తంగా క్వింటాలుకు రూ. వెయ్యి ఖర్చు అవుతున్న నేపధ్యంలో సగటు ధరకే కొద్దిమంది రైతులు కల్లాల్లోనే పంటలను విక్రయిస్తున్నారు.