Mar 08,2023 16:59

లండన్‌ : బాల్యంలో న్యూమోనియా సమస్యలతో బాధపడినవారిలో మరణించే శాతం ఎక్కువని తాజాగా లాన్సెట్‌ జర్నల్‌ నివేదిక వెల్లడించింది. శ్వాసకోశ సమస్యలతో 26 నుండి 73 మధ్య వయసు గల మరణించేవారిలో బాల్యంలో న్యూమోనియా సమస్యలతో బాధపడినవారేనని.. అలాంటివారిలోనే మరణించే శాతం ఎక్కువని నివేదిక పేర్కొంది. పెద్ద వయసుగలవారు అకాల మరణాలకు గురైన వారు రెండు సంవత్సరాలలోపు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడినవారేనని ఈ నివేదిక స్పష్టం చేసింది. శ్వాసకోశ సమస్య చాలా చిన్న అనారోగ్య సమస్య అయినప్పటికీ ఆ ప్రభావం జీవితాంతం ఉంటుంది. చనిపోయిన ప్రతి ఐదుగురిలో ఒకరు బాల్యంలో న్యూమోనియాతో బాధపడినవారేనని ఈ నివేదిక వెల్లడించింది. 2017లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 3.9 మిలియన్ల మరణాల్లో 7 శాతం శ్వాసకోశ సంబంధిత సమస్యలతో మృతి చెందినవారేనని పరిశోధకులు తెలిపారు. అకాల మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు వారి ఆహార అలవాట్లను కూడా పరిశోధకులు పరిశీలించారు. ధూమపానం అలవాటు ఉన్నవారిలో శ్వాసకోశ సమస్యలు మరింత పెరిగే ప్రమాదముందని ఈ అధ్యయనంలో తేలిందని లండన్‌ ఇపీరియల్‌ కాలేజ్‌కి చెందిన జేమ్స్‌ అల్లిన్సన్‌ తెలిపారు. మరణించిన పెద్ద వయసు వారిలో బాల్యంలో శ్వాసకోశ సమస్యలకు లింక్‌ ఉందని అల్లిన్సన్‌ వెల్లడించారు. 1946 నుండి 2019 సంవత్సరాల మధ్య వయసు గలవారిలో ఈ అధ్యయనం చేయబడిందని పరిశోధకులు తెలిపారు.