Jun 03,2023 11:00
  • 500 మంది ఇంజనీర్ల భవిత ప్రశ్నార్థకం
  • రాయలసీమ అభివృద్ధి పనుల్లో స్తబ్దత
  • సిఎం జిల్లాకూ తప్పని ఎఫ్‌ఎసి జాడ్యం

ప్రజాశక్తి- కడప ప్రతినిధి : రాష్ట్ర జలవనరుల శాఖలో అయోమయం నెలకొంది. రాష్ట్రంలో నాలుగు జోన్ల పరిధిలోని 500 మంది ఇంజనీర్ల భవిత కోర్టు కేసుల వల్ల ప్రశ్నార్థకంగా మారింది. ఇదే తరహా కోర్టు కేసులు కలిగిన పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి శాఖలు రెగ్యులర్‌ ఇంజనీరింగ్‌ నిపుణులతో పురోగతి బాటలో పయనిస్తున్నా, రాష్ట్ర జలవనరుల శాఖ పన్నుల్లో పురోగతి పడకేసింది.
         జోన్ల వారీగా ఉద్యోగోన్నతుల విషయంలో అభ్యంతరాలపై ఉమ్మడి రాష్ట్రం సమయంలో కొందరు ఇంజనీర్లు కోర్టుకు వెళ్లారు. దీంతో, ఉద్యోగోన్నతులు నిల్చిపోయాయి. కొత్త నియామకాలూ జరగడం లేదు. ఉన్న వారిపైనే పని భారం పడుతోంది. అవసరమైనంతమంది ఇంజనీర్లు లేక పనుల్లో పురోగతి పడకేసింది. రాష్ట్ర జలవనరుల శాఖలో ముగ్గురు ఇంజనీరింగ్‌ ఇన్‌ ఛీప్‌లు (ఇఎన్‌సిలు), 12 మంది సిఇలు, 250 మంది ఇఇలు, 40 మంది ఎస్‌ఇలతో డిఇలు, ఎఇలతో కూడిన ఇంజనీరింగ్‌ పాలనా రథం నడుస్తోంది. వీరిలో 10 నుంచి 12 శాతం మంది ఇంజనీర్లు అదనపు బాధ్యత (ఎఫ్‌ఎసి)లు నిర్వహిస్తున్నారు. ఒక్కరే మూడు బాధ్యతలు చూస్తున్న వారూ ఉన్నారు. వీరిలో కొందరికి 58 ఏళ్లు ఉన్నాయి. వయస్సు రీత్యా ఏ ఒక్క బాధ్యతకూ న్యాయం చేయలేని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కీలక ఇంజనీర్లుగా గుర్తింపు పొందిన ముగ్గురు ఇఎన్‌సిలు, సిఇసిడిఒ, 12 మంది సిఇలు, 25 మంది ఇఇలు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఎసిలు)గానే విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ మూడు జిల్లాల్లో చీఫ్‌ ఇంజనీర్లుగా బాధ్యతలు నిర్వహించడం తలకుమించిన భారంగా మారింది. పది రోజులకు ఒకసారి కూడా మూడు జిల్లాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఫలితంగా రాష్ట్రంలో ఏటా రూ.25 వేల కోట్లతో కూడిన అభివృద్ధి పనుల్లో స్తబ్దత నెలకొందనే విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. రాష్ట్రంలో 20 మంది సిఇ పోస్టులకుగానూ 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన ఎనిమిది సిఇ పోస్టుల్లో ఆరుగురు వచ్చే జనవరిలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. మిగిలిన సిఇలు, ఎస్‌ఇలు వచ్చే ఏడాది మార్చి, జూన్‌ నాటికి ఉద్యోగ విరమణ చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఒంగోలు, కృష్ణా జిల్లాల సిఇలు మినహా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా మొదలుకుని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సిఇలందరూ ఎఫ్‌ఎసిలుగానే కొనసాగుతున్నారు. కడప జిల్లాలోని ఐదుగురు ఎస్‌ఇల్లో ఒకరు మినహా, ఇఇల్లో 85 శాతం మంది ఎఫ్‌ఎసిలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిలో సిఇ, ఎస్‌ఇలతో కూడిన కొంతమంది పది రోజులకు ఒకసారి కూడా జిల్లాకు రావడం గగనంగా మారింది. దీంతో, జిల్లాలో ఇంజనీరింగ్‌ పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కరువు పీడిత ప్రాంతంగా గుర్తింపు పొందిన రాయలసీమ జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టు పనుల పురోగతికి ఇది ప్రతిబంధంగా మారారనే విమర్శ వినిపిస్తోంది. రాయలసీమలోని కడప జిల్లాలో గాలేరు-నగరి నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఎత్తిపోతలు మొదలుకుని యురేనియం నిర్వాసిత గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే పార్నపల్లి ఎత్తిపోతల పనుల వరకు సుమారు రూ.10 వేల కోట్లతో కూడిన పనుల్లో ఆశించిన పురోగతి కొరవడినట్లు ఇంజనీరింగ్‌ గణాంకాలే తెలియజేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి ప్రస్తుత ఉద్యోగుల జనరల్‌ బదిలీల నేపథ్యంలో ఎఫ్‌ఎసిలను తొలగించి రెగ్యులర్‌ ఇంజనీరింగ్‌ అధికారులను నియమిస్తేనే రెండేళ్ల కిందట వరదల్లో తెగిన అన్నమయ్య, పింఛా వంటి సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో పురోగతి కనిపించే అవకాశం ఉంది. కోర్టు కేసు పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని, ఉద్యోగోన్నతులు కల్పించాలని ఇంజనీర్లు కోరుతున్నారు.