Sep 24,2023 09:31
  • ఇవాళ్టితో ముగియనున్న చంద్రబాబు కస్టడీ, రిమాండ్‌..

ప్రజాశక్తి-రాజమండ్రి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు నాయుడు రెండో రోజు విచారణ ప్రారంభమైంది. 40 నిమిషాలు ముందుగానే రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు చేరుకున్న సీఐడీ బృందం విచారణను ప్రారంభించారు. విచారణకు ముందు చంద్రబాబుకు యథావిధిగా మొదట వైద్య పరీక్షలు నిర్వహించారు. 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ.. దాదాపు 6 గంటల పాటూ ఆయన్ని ప్రశ్నించారు. నిన్నటిలానే.. గంటగంటకు ఐదు నిమిషాలు బ్రేక్‌.. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల వరకు లంచ్‌ బ్రేక్‌ ఇవ్వనున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం రెండో రోజు విచారణ కొనసాగుతోంది. న్యాయవాదుల సమక్షంలో చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు రెండో రోజు విచారణ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్‌ జైలు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. నేటితో చంద్రబాబు రెండు రోజుల విచారణ ముగియనుంది. అంతనరం సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టు సీల్డు కవర్‌లో నివేదికను అందించనున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ జరిగిన తీరును, చంద్రబాబు నుంచి సేకరించిన సమాచారాన్ని కోర్టుకు అందించనుంది.