ప్రజాశక్తి-అమరావతి : ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లేప్పుడు జరిగిన ఘటన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది. ఈ వ్యవహారంపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ప్రతివాదులైన ముదివేడు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, అన్నమయ్య జిల్లా ఎస్‌పికి నోటీసులు జారీ చేస్తూ జస్టిస్ కె సురేష్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముదివేడు పోలీసులు తనపై కేసు (79/2023) నమోదుచేశారని, ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ర్యాలీ నిర్వహించేందుకు పోలీసుల నుంచి ముందుగా అనుమతి తీసుకున్నామని, అంగళ్లు కూడలికి ర్యాలీ చేరుకోగానే అధికారపార్టీ వాళ్లు కాన్వాయిపై రాళ్లు వేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వివరాలు సమర్పించేందుకు వారం రోజుల గడువు కావాలని పోలీసుల తరపున అదనపు పిపి దుష్యంత్ రెడ్డి కోరడంతో హైకోర్టు అనుమతినిచ్చింది.










