ఆర్థిక క్రమశిక్షణ, రుణాలపై ఆర్‌బిఐ ఆదేశాలు
భేటీలో తలూపిన అధికారులు
నగదు నిర్వహణలపై మాత్రం అంతర్మథనం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఆర్థిక క్రమశిక్షణ పేరిట రాష్ట్రాలపై పెత్తనానికి కేంద్రం పదేపదే ప్రయత్నిస్తోంది. తాను ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడకపోయినా, రాష్ట్రాలు మాత్రం కట్టుబడి ఉండాలని చెబుతోంది. తాజాగా అన్ని రాష్ట్రాల ఆర్థికశాఖ కార్యదర్శులతో జరిగిన భేటీలో కూడా ఇదే సూచనలు చేసింది. అన్ని రాష్ట్రాలూ రుణాలు, నగదు నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరాన్ని కేంద్ర ఆర్థికశాఖ, రిజర్వు బ్యాంకులు తేల్చిచెప్పడం గమనార్హం. కేత్ర స్థాయిలో సాధ్యం కాకపోయినా, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాలు కూడా ఆర్‌బిఐ సూచనలకు సరే అనడం గమనార్హం. నాలుగు రోజుల క్రితం జరిగిన సమావేశంలో రుణాలు, నగదు నిర్వహణ, వ్యయం వంటి అనేక అరశాలపై ఆర్‌బిఐ దిశా నిర్దేశం చేసింది. ఈ భేటీలో కాగ్, కేంద్ర ఆర్థికశాఖ, అకౌంటెంట్ జనరల్ కార్యాలయ అధికారులు కూడా పాల్గొనడంతో విస్తృత చర్చ జరిగినట్లు తెలిసింది. రుణాలు తీసుకునే సమయంలో నిర్ధిష్టమైన విధానాలు పాటించాల్సిన అవసరాన్ని కూడా రాష్ట్రాలకు స్పష్టం చేసింది. వివేకమంతమైన విధానాన్ని అనుసరించాలని తేల్చిచెప్పింది. ఇష్టానుసారం అప్పులు చేయడం వల్ల నష్టాలేనన్న భావాన్ని కూడా భేటీలో వ్యక్తం చేయడం, వ్యయం చేయడంలో సరైన విధానాలను పాటించడంపైనా సూచనలు చేసింది.
ఈ సూచనలపై అనేక రాష్ట్రాలు స్పందిస్తూ.. తాము వాటిని పాటిస్తున్నట్లు భేటీలో వెల్లడించడం గమనార్హం. అయితే క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి మాత్రం ఆ సూచనలు గాలిలో కలిసిపోతున్నట్లు కనిపిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక నిర్వహణ ఆశించిన స్థాయిలో లేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అనవసర వ్యయం పెరిగిపోవడం వల్ల పరిమితికి మించిన రుణాలు చేయాల్సిన పరిస్థితి కూడా నెలకొంటోంది. కేంద్రం కూడా రుణాలపై అన్ని రాష్ట్రాలనూ ప్రోత్సహించడం వల్ల ఆర్‌బిఐ, కాగ్ సూచనలు అమలులో సాధ్యం కావడం లేదన్న భావాన్ని కొంత మంది సీనియర్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాలకు అవసరమైన గ్రాంట్లను ఇవ్వడంలో వెనుకంజ వేస్తున్న కేంద్రం రాష్ట్రాలను రుణాలపై ప్రేరేపిస్తూ రాష్ట్రాలు అప్పులపాలయ్యేందుకు కారణమవుతున్నట్లు కూడా విమర్శలు ఉన్నాయి. అందుకే రిజర్వు బ్యాంకు చేసే మార్గదర్శకాలు కేవలం చర్చలకే పరిమితమవుతున్నట్లు కనిపిస్తోంది.










