Apr 15,2023 10:01
  • టిడ్కో ఇళ్ల పంపిణీకి మీనమేషాలు

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల పంపిణీ పేరిట పది రోజుల సంబరాలు చేపట్టి దాదాపు పది నెలలు కావస్తోంది. వాటి అప్పగింతకు మాత్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో, లబ్ధిదారులు తీవ్ర నిరాశకు, అయోమయానికి గురవుతున్నారు. పట్టణ పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2.62 లక్షల టిడ్కో గృహాలను గత ప్రభుత్వం చేపట్టిన విషయం విదితమే. అప్పట్లో వీటిని పూర్తి చేయకుండానే లబ్ధిదారులకు అర్హత పత్రాలు అందజేసింది. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం అర్హత పత్రాలను రద్దు చేసి, వాటి స్థానే వైసిపి బొమ్మలు, రంగులతో కూడిన పత్రాలను లబ్ధిదారులకు ఇచ్చింది. అప్పట్లోనే లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలంటూ సిపిఎం, ఇతర పార్టీలు ఆందోళనకు దిగాయి. దీంతో, టిడిపి హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు, అనుయాయులకు కేటాయించారనే విమర్శలతో కొంతకాలం వైసిపి ప్రభుత్వం కాలయాపన చేసింది. గృహ నిర్మాణాలు పూర్తి కాలేదని, గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాక పంపిణీ చేస్తామని మరికొంత కాలం చెప్పుకొచ్చింది. ఇలా మూడేళ్లు గడిచినా ఇళ్లు అప్పగించకపోవడంతో లబ్ధిదారుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగి సిపిఎం తదితర పార్టీల ఆధ్వర్యాన ఏడాది క్రితం మరోమారు ఆందోళనకు దిగారు. దీన్ని చల్లార్చేందుకు ప్రభుత్వం విజయనగరం జిల్లా కేంద్రంలోని సారిపల్లిలో తలపెట్టిన టిడ్కో గృహ సముదాయంలో గతేడాది జూన్‌ 23న ఇళ్ల పంపిణీ ప్రారంభ సభ పెట్టింది. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, టిడ్కో చైర్మన్‌ ప్రసన్నకుమార్‌ హాజరయ్యారు. గృహ సముదాయంలో పూజలు, పలువురికి పట్టువస్త్రాల పంపిణీ, సహఫంక్తి భోజనాలు చేపట్టిన మంత్రులు పది రోజుల పాటు టిడ్కో సంబరాలు చేపట్టాలని ఆదేశించారు. కథ అంతటితోనే ముగిసిపోయింది. ఇళ్ల అప్పగింత మాత్రం జరగలేదు. మొత్తంగా టిడ్కో ఇళ్లన్నీ గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయినా ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు సర్కారు తాత్సారం చేస్తోందంటూ టిడిపి విమర్శలు గుప్పిస్తోంది.
 

                                                               విజయనగరం జిల్లాలో పరిస్థితి ఇది

విజయనగరం పరిధిలోని సారిపల్లిలో 2,656, సోనియా నగర్‌లో 1,120, నెల్లిమర్ల మండల కేంద్రంలో 576, బొబ్బిలిలో 1680, రాజాంలో 336 చొప్పున మూడు కేటగిరిల్లో మొత్తం 6,368 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. వీటిలో ఇప్పటి వరకు సారిపల్లిలోని సగానికి సగం ఫ్లాట్లకు మాత్రమే రోడ్లు, కాలువలు, తాగునీరు, విద్యుత్తు సదుపాయం వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. అనర్హత పేరిట చాలామందిని తొలగించినట్టు వైసిపి నాయకులు ప్రచారం చేస్తుండడం, మరోవైపు మొత్తం లబ్ధిదారుల తుదిజాబితా ఇప్పటికీ బహిర్గతం చేయకపోవడం వంటి కారణాలతో లబ్ధిదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
 

                                                   నెలనెలా డబ్బులు చెల్లిస్తున్నా ఇల్లు అప్పగించలేదు

నెలనెలా రూ.2,500 చొప్పున డబ్బులు చెల్లిస్తున్నాను. ఇప్పటికీ ఇల్లు మాత్రం అప్పగించలేదు. వాస్తవానికి చంద్రబాబు పాలనలో ఇంటికి సంబంధించిన అలాట్‌మెంట్‌ పత్రాలు నా పేరున ఇచ్చారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక నా పేరుకు బదులు నా భార్య పేరుపై ఇచ్చింది. నెలకోసారి ఆధార్‌, పాన్‌, బ్యాంకు పాస్‌పాసు పుస్తకాల జిరాక్స్‌లు, ఫొటోలు అడుగుతున్నారు. అవి తీసుకోవడమే మిగిలింది తప్ప, ఇప్పటికీ ఇల్లు అప్పగించలేదు. ఇంటి అద్దె కట్టలేక, ఇంటికి డబ్బులు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం.
                                                                                         - సబ్బారపు బుచ్చినాయుడు, టిడ్కో లబ్ధిదారుడు,
                                                                                                           ఉడా కాలనీ, విజయనగరం