హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్- 1 ప్రిలిమ్స్ పరీక్షను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. గత జూన్ నెల 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్షకు 2.32 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం పరీక్ష జరిగింది. ఈక్రమంలో ... గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్‌లు వేశారు. ఈ పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.










