Dec 29,2022 07:04

అవునూ...
నెత్తుటి చుక్కకు నేర్పిందెవరు?
నిన్ను చూస్తేనే భయపడేంత
ఎరుపెక్కాలి నువ్వని.
ఎప్పుడూ
విడివిడిగా ఉండే
కారుమబ్బులను ఎకాయెకి కలిపిందెవరు?
తాత్కాలికంగా వెలుగును
తరిమివేయాలి మీరని.
అప్పటికప్పుడు
ఆకులు రాల్చుకొమ్మని
చెట్లను ఆతురత పెట్టిందెవరు?
అవసానాన్ని అంత కష్టపడి
మోయాల్సిన అవసరం మీకు లేదని.
మలినాలన్నీ
తొలినాళ్లలోనే తోసివేయమని
నదులకు నిధులిచ్చి మరీ విధులప్పజెప్పిందెవరు?
నీలి రంగుతో ఒళ్ళంతా
నిగనిగలాడాలి నువ్వని.
గమ్యం లేని
గమనం చేయమని
గాలికి చెప్పిందెవరు?
ప్రాణులకు చలనశీలతనిచ్చే
వరమవ్వాలి నువ్వని.
కదిలే ప్రతి సృష్టి
ప్రేరణాత్మకమైన ఓ కథ
చెబుతూనే ఉంది
నేర్చుకో మెల్లగా.
నేడో రేపో
నిన్ను నీవు మార్చుకో
అందమైన హరివిల్లుగా.

- కమలేశ్‌, సెల్‌ : 9160396596