Sep 28,2023 22:13

డిజిపికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు కాకినాడలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న సిపిఎం నాయకుల పట్ల దురుసుగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు డిజిపి కెవి రాజేంద్రనాథ్‌ రెడ్డికి ఆయన గురువారం లేఖ రాశారు. కాకినాడలో ప్రశాంతంగా ధర్నా చేయడానికి వెళ్తున్న సిపిఎం నాయకులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. మహిళా నాయకులు సిహెచ్‌ రమణిపై సిఐ భగవాన్‌ చేతులు వేసి నెట్టుకుంటూ పోలీసు వాహనం ఎక్కించారని తెలిపారు. మహిళలపై పురుష పోలీసు అధికారులు ఇలా వ్యవహరించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఈ అంశంపై అభ్యంతరం చెప్పిన సిపిఎం నాయకులపై డిఎస్‌పి మురళీకృష్ణా రెడ్డి దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. కింది స్థాయి పోలీసులు తప్పు చేస్తే సరిచేయాల్సిన పోలీసు అధికారులే మహిళలపై, పార్టీ నాయకులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని, వారు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. పోలీసులు తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకు వామపక్ష నాయకులపై కేసులు పెట్టారని వివరించారు. ప్రశాంతంగా జరుగుతున్న నిరసనలపై కూడా నిర్బంధం ప్రయోగించారని, మహిళా నాయకుల పట్ల అమానుషంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై విచారణ జరిపి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు.