Sep 23,2023 12:05

రాజమండ్రి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబును సిఐడి అధికారులు శనివారం రాజమండ్రి సెంట్రల్‌ జైలులోనే విచారిస్తున్నారు. 48 గంటలపాటు విచారణ జరిపేందుకు సిఐడి అధికారులకు అనుమతి లభించింది. అయితే.. ఈరోజు ఉదయం 9.30 గంటలకే విచారణ ప్రారంభమయ్యింది. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ సమక్షంలో 12 మంది సభ్యుల సిఐడి బృందం చంద్రబాబును విచారిస్తుంది. చంద్రబాబును ప్రశ్నించేందుకు కాన్ఫరెన్స్‌ హాల్‌ను జైలు అధికారులు సిద్ధం చేశారు. విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎసిబి కోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రక్రియను మొత్తం సిఐడి అధికారులు వీడియో తీస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబుని విచారిస్తున్న సందర్భంగా.. అక్కడ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ప్రతి గంటకు 5 నిమిషాల బ్రేక్‌...
విచారణ సమయంలో ప్రతి గంటకు 5 నిమిషాల బ్రేక్‌ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మ.2 గంటల వరకు లంచ్‌ బ్రేక్‌ ఇవ్వనున్నారు. లంచ్‌ విరామం తరువాత ప్రతి గంటకు 5 నిమిషాలపాటు విరామం ఇస్తూ.. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగించనున్నారు. విచారణ పూర్తి అయ్యాక కూడా వైద్యులు ఆయన ఆరోగ్యం గురించి పరీక్షించనున్నారు.