- దూరమవుతున్న సాంప్రదాయ ఓటర్లు
- ఆందోళనపడుతున్న బిజెపి, కాంగ్రెస్, జెడి(ఎస్)
- కాషాయ పార్టీ విద్వేష వ్యూహాలు, ధరల పెరుగుదలపైనా జనాగ్రహం
న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కెతోంది. అన్ని రాజకీయ పార్టీలు తమ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ దూరమవుతుండటంపై ఆందోళన చెందుతున్నాయి. వీరి మద్దతును మళ్లీ ఎలా పొందాలో అనే విషయంపై పార్టీలు ప్రణాళికలు వేస్తున్నాయి.
సాధారణంగా కర్ణాటకలో బిజెపికి లింగాయత్‌లు, కాంగ్రెస్‌కు వక్కలిగలు, అహిందలు, జనతాదళ్ (ఎస్)కు హస్సన్, మండ్యాలను సాంప్రదాయ ఓట్ బ్యాంక్‌గా భావిస్తుంటారు. తాజా ఎన్నికల్లో ఈ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ దూరమవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు ఆ పార్టీలు చేసిన తప్పిదాలే కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు విపరీతంగా పెరిగిన ధరలు, మైనారిటీలపై విద్వేషం వెళ్లగక్కే అజెండా కూడా బిజెపికి నష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు.
అధికారంలో బిజెపి విషయానికి వస్తే ఈ పార్టీ గుజరాత్‌లో అనుసరించిన విధానాన్నే కర్ణాటకలో కూడా అమలు చేయాలని ప్రయత్నం చేసి తీవ్రంగా భంగపడింది. టిక్కెట్ల కేటాయింపులో ఒక తరానికి చెందిన ప్రముఖ నాయకులను పూర్తిగా పక్కన పెట్టింది. వీరిలో ఎక్కువ మంది లింగాయత్ నాయకులే ఉన్నారు. తమకు టిక్కెట్లు రాకపోవడంతో లింగాయత్‌లకు చెందిన సీనియర్ నాయకులు జగదీశ్ షెట్టర్, లక్ష్మణ్ సవాదీ వంటి నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో బిజెపికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం లింగాయత్ ఓటర్లే బిజెపిపై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో కమలం పార్టీకి ఈ ఎన్నికల్లో కష్టాలు తప్పవని భావిస్తున్నారు. జగదీశ్ షెట్టర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ఆ పార్టీకి ఎంతో లాభం చేస్తుందని బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డానే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం. లింగాయత్‌లు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండటం కొత్త కాదు. 1991కు ముందు వారు కాంగ్రెస్ వైపునే ఉండేవారు. తరువాత నుంచి బిజెపికి దగ్గరగా మారారు. లింగాయత్‌లు మళ్లీ కాంగ్రెస్‌కు దగ్గర కావడం ఆ పార్టీకి మేలు చేస్తుందా.. లేదా అనేది ఎన్నికల ఫలితాల ద్వారానే వెల్లడవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే లింగాయత్‌లు కాంగ్రెస్‌కు దగ్గర కావడం వల్ల వక్కలిగలు, అహిందలు వంటి వారు ఆ పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
జెడి(ఎస్) పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. బిజెపి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి 28 స్థానాల్లో జెడి(ఎస్) టిక్కెట్లు ఇచ్చింది. సొంత నేతలను కాదని ఇంత మందికి టిక్కెట్లు కేటాయించడంపై సొంత క్యాడర్, ఓటు బ్యాంక్‌లో అసంతృప్తి నెలకుంది. దేవగౌడ కుటుంబంలోని గొడవలు కూడా ఆ పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తాయని భావిస్తున్నారు. హసన్ నియోజకవర్గం టిక్కెట్టు కోసం దేవగౌడ కుమారులు కుమారస్వామి, హెచ్‌డి రెవన్న భార్య భవాని రెవన్న పట్టుపట్టారు. చివరికి ఈ స్థానాన్ని వేరే వారికి కేటాయించాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులతోనే 90 ఏళ్ల వయసులో కూడా దేవగౌడ ప్రచారం నిర్వహించాల్సి వస్తోంది. ఈ సారి కర్ణాటక ఎన్నికలు చాలా ఆసక్తికరంగా సాగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
యోగిల ప్రచారంపై నిషేధం విధించండి : ఇసికి కాంగ్రెస్ ఫిర్యాదు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌పై నిషేధం విధించాలని ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఈ ఇద్దరు నాయకులు మైనార్టీలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అభిషేక్ సింఘ్వి, పవన్‌కుమార్ బన్సాల్, ముకుల్ వాస్నిక్‌లతో కూడిన కాంగ్రెస్ నాయకుల ప్రతినిధి బృందం ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను కలిసింది. అమిత్ షా, ఆదిత్యనాధ్ ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తప్పుడు, పక్షపాతధోరణితో కూడిన, మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపింది. ఈ నాయకులపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని తెలిపారు.










