Apr 17,2023 15:55

అస్సాం హిమంత బిశ్వ ప్రభుత్వం బాల్య వివాహాల పేరిట వేలాదిమందిని అరెస్టు చేసి జైళ్లలో ఉంచింది. ఈ ఒక్క ఘటనతో దేశవ్యాప్తంగా బాల్య వివాహాల వ్యవహారంపై పెద్ద దుమారమే రేగింది. ప్రతిపక్షాలు మండిపడుతున్నా.. అస్సాం ప్రభుత్వం తాను చేయాల్సింది చేసి అక్కడున్న ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని, పిల్లల్ని భయభ్రాంతులకు గురిచేసింది. గత కొన్నేళ్లుగా లేని ఈ దుశ్చర్యకు ఇప్పుడే ఎందుకు పాల్పడింది? వాటికి గల కారణాల్లోకి వెళితే.. హిమంత బిశ్వశర్మ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ఏ విధంగా పాల్పడుతున్నారనేది తెలుస్తుంది. అస్సాంలో బాల్య వివాహాలపై, ప్రభుత్వం చేసిన అక్రమ అరెస్టులపై ఐద్వా (ఆల్‌ ఇండియా డెమోక్రటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌) ఇటీవల సర్వే చేసింది. ఈ సర్వేలో అనేక నిజాలు వెలుగులొకొచ్చాయి. చట్టాన్ని సాకుగా చూపి.. ఆ చట్టానికే తూట్లు పొడుస్తున్న వైనాన్ని, రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ బహిర్గతం చేశారు. బాల్య వివాహాలపై అసలు అస్సాం ప్రభుత్వం ఏం చెబుతుంది? అక్కడ జరుగుతున్న అసలు వాస్తవాలేంటో తెలుసుకునేందుకు ఐద్వా బృందంతో కలిసి బృందాకరత్‌ కూడా రెండు జిల్లాలను సందర్శించారు. ఆయా జిల్లాల్లో బాల్యల వివాహాల వల్ల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను, ఐద్వా బృందం గుర్తించిన పలు అంశాలను బృందాకరత్‌ వెల్లడించారు.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా జరిగిన అరెస్టులపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఇటీవల అసెంబ్లీలో వెల్లడించారు. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా జరిగిన అరెస్టులలో ముస్లింలు, హిందువుల అరెస్టుల నిష్పత్తి 55:45గా ఉందన్నారు. అదేవిధంగా ప్రతిపక్షాలు బాధపడతాయని 'మా' ప్రజలలో కొందరిని కూడా అరెస్టు చేయడం జరిగిందని నొక్కి చెప్పారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడిన 'మా' ప్రజలు అనే పదం ఎక్కడ నుండి వచ్చింది? హిందువులు కానివారు ఆయన దృష్టిలో 'మా ప్రజలు' కారనా?. ఆయన ప్రకటించిన అరెస్టుల నిష్పత్తి కచ్చితమైన సమాచారమో కాదో తెలియదు. కానీ.. హిందుత్వ భావనను పెంచి పోషిస్తున్నట్లు మాత్రం ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యాంగ పీఠికలో మేము భారతదేశ ప్రజలం అనే చెబుతుంది. ప్రత్యేకంగా మేము ఈ మతానికి చెందినవారమో.. లేదా ఆ మతానికి చెందినవారమనో చెప్పడం లేదు. ఈ దేశంలోని పౌరులందరూ భారతీయులమనే రాజ్యాంగం పేర్కొంది.

child marriage


అస్సాంలో బాల్య వివాహాలు పెరుగుతున్నాయని, విద్యా ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని, గృహ హింస అధిక రేటులో ఉందని.. అనేక సామాజిక ఆర్థిక సూచికలలో అస్సాం దిగువన ఉందని నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5) చెబుతోంది. ఈ సర్వే తర్వాత కూడా అస్సాం ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఉదాహరణకు, బాల్య వివాహాల పట్ల అవగాహన కల్పించడానికి, బాల్య వివాహాలను నిరోధానికి, జోక్యం చేసుకోవడానికి అధికారులను, పౌర కమిటీలను ఏర్పాటు చేయాలని బాల్య వివాహాల నిషేధ చట్టం చెబుతోంది. ఈ రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టులు జరిగేంత వరకూ అలాంటి ఒక్క అధికారిని కూడా నియమించడం కానీ, లేదా అలాంటి కమిటీని ఏర్పాటు చేయడం కానీ జరగలేదు. కేరళ వంటి రాష్ట్రాల అనుభవాలను పరిశీలిస్తే... ఈ సాంఘిక దురాచారాన్ని నిర్మూలించడానికి విద్య కీలకమని స్పష్టం చేస్తున్నది. అస్సాంలోని ముస్లిం జనాభా అధికంగా ఉన్న దుబ్రీ జిల్లాలో బాల్య వివాహాల గణాంకాలను కూడా హిమంత బిశ్వ శర్మ అసెంబ్లీలో నొక్కి చెప్పారు. అయితే, ముస్లిం రాష్ట్రంగా ఉన్న కాశ్మీర్‌లో బాల్య వివాహాల శాతం చాలా తక్కువగా ఉంది. ఈ విషయాన్ని ఆయన కావాలనే విస్మరించినట్లు కనిపిస్తోంది.
అస్సాంలో బాల్య వివాహాలపై అనేక జిల్లాల్లో ఐద్వా (ఆల్‌ ఇండియా డెమోక్రటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌) సర్వే చేసింది. నేను కూడా ఇటీవల ఐద్వా బృందంతో కలిసి ఆ రాష్ట్రంలోని రెండు జిల్లాలను సందర్శించాను. ఈ సందర్భంగా ఆ జిల్లాల్లో అనేకమంది బాల్యవివాహ బాధితులను కలుసుకున్నాం. బాధితులంతా అరెస్టులకు వ్యతిరేకంగా బాధపడుతున్నారు. కొంతమంది గర్బవతులుగా ఉన్నారు. మరికొంతమంది చేతిలో చంటిబిడ్డను ఎత్తుకొని ఉన్నారు. ఈ యువతుల్లో వారి భర్తలు లేదా, వారి బంధువుల్లో అరెస్టు అయినవారే ఉన్నారు. ఈ అరెస్టులకు సంబంధించి ఇంకా లోతుల్లోకి వెళితే... ఆ యువతుల భర్తలను అరెస్టు చేయడానికి కంటే ముందే.. ప్రభుత్వం ఆ మహిళల వ్యక్తిగత డేటాను సేకరించింది. ప్రత్యేకంగా మహిళల వయస్సుతో సహా సేకరించింది. మహిళలు హెల్త్‌ చెకప్‌ కోసం లేదా వారి బిడ్డల చికిత్స కోసం నమోదు చేసుకున్న సమాచారాన్ని ఆరోగ్యశాఖ నుండి తీసుకొని, దాన్ని పోలీసులకు అందజేయడం ద్వారా వారు ఆ మహిళల భర్తలను అరెస్టులు చేశారు. ఓ రకంగా ఇది ప్రయివేటు ఆసుపత్రుల నుంచి తీసుకున్న డేటా అయినప్పటికీ ఈ సమాచారం చాలా పరిమితమైనదనే చెప్పుకోవాలి. ప్రభుత్వం చేసే ఇలాంటి పనుల వల్ల మహిళల గోప్యతకు భంగం కలిగించడమే అవుతుంది. ప్రధానంగా వారి దగ్గర నుంచి ఇలాంటి సమాచారం తీసుకుంటున్నారనే భావన కలిగినప్పుడు మహిళలు ఆరోగ్యకేంద్రాలకు వెళ్లడం కూడా మానేస్తారు. ఇప్పటికే శిశుమరణాలు, మాతాశిశు మరణాల వంటి ఆరోగ్య సూచికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మా బృందంతో వారి బాధను కూడా పంచుకున్నారు. అసలు 'మేము ఆరోగ్య కేంద్రాలకు కనుక వెళ్లకపోతే ఈ అరెస్టులు జరిగేవి కాదు కదా..!' అని వారు మాతో అన్నారు.

child marriage


ఇక అస్సాం ప్రభుత్వం రెండవ చట్టవిరుద్ధమైనది ఏం చేసిందంటే.. పిసిఎంఎ (బాల్య వివాహాల నిషేధ చట్టం) ప్రకారం, బాల్యం వివాహం స్వయంచాలకంగా రద్దు చేయబడదు. కానీ మెజారిటీ వయసు వచ్చిన తర్వాత జంటలో ఒకరు వారి వివాహాన్ని రద్దు చేయమని కోరితేనే రద్దవుతుంది. లేకపోతే అది చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుంది. మేము కలుసుకున్న ఐద్వా బృందం కానీ, అంతకుముందు ఐద్వా చేసిన సర్వేలో కానీ.. చాలామంది అమ్మాయిలు ఇప్పుడు 18 ఏళ్లు దాటారు. అయితే వారిలో ఒక్కరు కూడా వారి వివాహాన్ని రద్దు చేయమని అడగలేదు. అలాంటప్పుడు వాళ్లు అడగకుండానే వారి భర్తలను ఎలా అరెస్ట్‌ చేస్తారు? మళ్లీ అనేక కేసుల్లో యువతీ యువకులు తల్లిదండ్రులకు తెలియకుండా పారిపోయారు. అలా వారు పారిపోయిన తర్వాతే వారి తల్లిదండ్రులు వారి వివాహాన్ని గుర్తించారు.
మూడవది పిసిఎంఎ సెక్షన్‌ 11 ప్రకారం ఏ స్త్రీనీ జైలులో పెట్టకూడదు. మేము కలుసుకున్న బాధితుల్లో 17 ఏళ్ల అమ్మాయితో పారిపోయిన ఒక అబ్బాయి తల్లి కూడా ఉంది. ఆమె దాదాపు ఒక నెలపాటు జైలులో ఉంది. అక్రమ వలసదారులకు ఉద్దేశించిన నిర్బంధ కేంద్రాల్లో ఒకదానిలో ఆమెను బంధించి ఉంచారు. ఇలా ఆమె ఒక్కతే కాదు. ఆమెలాంటి మరో 26 మంది మహిళలు కూడా జైలుపాలయ్యారని ఆమె మా బృందంతో చెప్పారు. ప్రభుత్వం చేసిన ఈ చర్య కూడా చట్టవిరుద్ధమే. 14 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న బాల్యవివాహాల కేసులన్నింటికీ పోక్సో చట్టం వర్తింపజేయనున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. మేము చూసిన వాటిల్లో దేనికీ పోక్సో చట్టం వర్తించదు. ఇంకా ఎఫ్‌ఐఆర్‌లో పోక్సో చేర్చడం వల్ల వారికి బెయిల్‌ లభించడం మరింత కష్టమైంది. దీంతో తమ భర్తలను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి మహిళలు సుమారు రూ. 40 వేలు నుంచి రూ.50 వేల వరకు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని బాధిత మహిళలే మా బృందానికి తెలిపారు. ఈ అప్పులు కేవలం వాళ్ల భర్తల విడుదల కోసం మాత్రమే కాదు... వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల కోసం కూడా. చివరగా ఆ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అప్పటివరకూ ఈ చర్యలు కొనసాగుతాయని అస్సాం ప్రభుత్వం ప్రకటించిందీ అంటే... రాజకీయ లబ్ధి కోసమే హిమంతబిశ్వ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు తెగబడుతోందని అర్థమౌతోంది. బాల్య వివాహాలను నిరాకరిస్తున్న పేరుతో నిస్సందేహంగా హిందూత్వ భావనను పెంచేందుకు, ప్రజలపై మత రంగును పులిమేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనేది సుస్పష్టం. బాల్య వివాహమనే సాంఘిక దురాచారాన్ని నిర్మూలించాల్సిందే. అయితే... అస్సాం ప్రభుత్వం అనుసరిస్తున్న క్రూరమైన చర్యలు, చట్టపరంగా ప్రశ్నార్థకమైన చర్యలు ఈ లక్ష్యాన్ని సాధించలేవు.