Jun 01,2023 14:42

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : మహిళ రెజ్లర్స్‌ను లైంగికంగా వేధింపులకు గురిచేసిన బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను వెంటనే అరెస్టు చేసి, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్ష పదవి నుండి తొలగించాలని రాజంపేట కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పూల భాస్కర్‌ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మల్ల యోధులు భారత ఒలంపిక్‌ అసోసియేషన్‌కు అనుబంధంగా ఉన్న ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు ఎంపీపై ఫిర్యాదు చేసినా, న్యాయం కోసం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నెలల తరబడి నిరసన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా చట్టాన్ని తుంగలో తొక్కడం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని తెలిపారు. ఎంపీని వెంటనే అరెస్టు చేసి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని, పోష్‌, పోస్కో చట్టాలను ప్రభావవంతంగా, వేగవంతంగా అమలు చేసి భారత రెజ్లర్లకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.