ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని క్యాంపు సైట్‌లో ఉంటున్న ఆయన సతీమణి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులను బుధవారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. సినీ నిర్మాత ఆదిశేషగిరిరావు ఆమెను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గతంలో తాను చంద్రబాబు, వైఎస్.రాజశేఖరరెడ్డిలను ముఖ్యమంత్రులుగా చూశానన్నారు. ఈ తరహా కక్ష సాధింపు రాజకీయాలు వారి మధ్య లేవని తెలిపారు. జగన్ పాలనలో కొత్త తరహా రాజకీయాలు చూస్తున్నామని అన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
రాష్ట్రంలో జగన్ ప్రతీకార రాజకీయం : శైలజానాథ్
రాష్ట్రంలో పగ, ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయని, కక్షసాధింపు కోసం ప్రభుత్వం ప్రయివేటు లాయర్లను పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని పిసిసి మాజీ అధ్యక్షులు సాకె శైలజానాథ్ విమర్శించారు. రాజమహేంద్రవరంలో ఉన్న భువనేశ్వరిని ఆయన పరామర్శించారు. అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ మంత్రులు శాఖాపర అంశాలు మానేసి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. ప్రజా సమస్యలపై చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డిల పోరాటం ఎంతో హుందాగా ఉండేదని పేర్కొన్నారు. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు మునుపెన్నడూ చూడలేదని తెలిపారు. రాష్ట్రంలో పాలన కనిపించట్లేదని, చంద్రబాబు వ్యక్తిత్వం ఎంతో గొప్పదని, ఆయనను ఇలా అరెస్టు చేయడం బాధాకరమన్నారు.










