Dec 04,2022 08:39

అదో పెద్ద చెరువు. చెరువు నిండా తామరాకులు. వాటి మధ్య తామర పువ్వులు చందమామల్లా మెరిసిపోతున్నాయి. ఆ మీదట గండు తుమ్మెదలు, సీతాకోకచిలుకలు పువ్వులమీద వాలుతూ కనులవిందు చేస్తున్నాయి. వాటితో పోటీపడుతూ రకరకాల పక్షుల కిలకిల రావాలు వీనులవిందు చేస్తున్నాయి. చెరువులోని చేపలు తామేమీ తక్కువ కాదని చెంగు చెంగున తుళ్ళుతూ నాట్యానందం కలిగిస్తున్నాయి.
ఆ అందమైన దశ్యాలకు ముగ్ధులవుతూ 'ప్రకృతి ఎంత అందమైనది! ఎంత చూసినా తనివి తీరదు, కదల బుద్ధి కాదు' అనుకుంటున్నారు అక్కడకు వచ్చిన జనం. ఒడ్డునున్న చెట్లు ఈ ఆహ్లాదకర వాతావరణానికి పరవశించిపోతున్నాయి. చల్లనిగాలి, మిలమిల మెరిసే తేటనీరు, నులివెచ్చని ఎండ పులకరింపచేస్తున్నాయి.
జనంలోని ఒక బాబు తన తండ్రితో 'నాన్నా, అటు చూడు! భూమి నవ్వుతోంది' అని విప్పారిన తామరపూలవైపు చూపించాడు. ఆ తండ్రి, కొడుకు చేసిన పోలికకు నివ్వెరపోయి, ఏమని పొగడాలో తోచక అరచేతిని అందుకుని ప్రేమతో ముద్దాడాడు.
అంతటి ఆహ్లాదపూరిత సమయంలో హఠాత్తుగా ఒక ఏనుగుల గుంపు అక్కడికి వచ్చింది. అంతే, అక్కడున్న జనమంతా పరుగో పరుగు. తుమ్మెదలు, సీతాకోకచిలుకలు ఆందోళనతో గజిబిజిగా ఎగరసాగాయి. తామరాకులు గజగజ వణికిపోయాయి. తామరపువ్వులు కళతప్పాయి. చేపలు నీటిలోపలికి పారిపోయాయి. తేటనీరు తల్లడిల్లిపోసాగింది. అదంతా చూసిన బాబు కళ తప్పిన పువ్వులను చూపుతూ 'నాన్నా! భూమి ఏడుస్తోంది..' అంటూ తండ్రితో పాటు పరుగెత్తాడు బిక్కమొకంతో.
ఆ అల్లకల్లోలాన్ని ఏనుగుల నాయకి గమనించింది. అది మంచిమనసు కలది. ఆలోచనలో పడింది. వెంటనే తోటి ఏనుగులతో 'పదండి. మనమిక్కడ జలకాలాడొద్దు. పక్కనే సెలయేరుంది. అక్కడికి పోదాం పదండి!' అంది. నాయకి మాటలను ఒక పిల్ల ఏనుగు కాదంది. 'ఇక్కడ తేట నీరు తాగొచ్చు. తామర పువ్వులను తెంపొచ్చు. తామర దుంపలు, ఆకులను తినొచ్చు. ఎగురుతున్న సీతాకోకచిలుకలను ఆటపట్టించొచ్చు. చేపలను భయభ్రాంతులకు గురి చేసి ఆనందించొచ్చు. నీటిలో ఆడొచ్చు. అందుకు ఇక్కడే బాగుంటుంది. ఇక్కడే దిగుదాం!' అంది. తుంటరి ఏనుగులు దానికి వంత పాడాయి.
అప్పుడు ఏనుగుల నాయకి వాటిని వారిస్తూ 'చెరువు కళకళలాడుతోంది. మనం దిగితే ఈ తేటనీరుండదు. కళకళలాడే ఆకులు, పువ్వులుండవు. అందమైన సీతాకోకచిలుకలుండవు. తుమ్మెద నాదాలుండవు. తుళ్ళుతూ కనిపిస్తున్న చేపలు మన పాదాల కింద నలిగి పోతాయి. ఇప్పటికే చెరువు అందాలు చూస్తూన్న మనుషులు పారిపోయారు. ఇందరి ఆనందాన్ని మనం పాడుచేసినవారమవుతాం. అందంగా ఉన్న ప్రకతిని చెడగొట్టడం మంచిది కాదు. అందాన్ని ఆరాధించాలిగాని కీడు చేయరాదని మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది' అని హితబోధ చేసింది. నాయకి మాటలను ఏనుగులన్నీ గౌరవించి అంగీకరించాయి. చెరువు నుంచి వెనక్కి మరలాయి.
క్షణాలలో చెరువు ఎప్పటిలా మారింది. ఆకులు కళకళలాడాయి. పూవులు పున్నమి చందమామలయ్యాయి. తుమ్మెదలు నాదాలు వినిపించాయి. పక్షులు కిలకిల రావాల సందడి చేశాయి. సీతాకోక చిలుకలు వయ్యారొలకబోస్తూ ఎగిరాయి. చేపలు నీటిపైన గెంతసాగాయి. మనుషులు చెరువు అందాలు చూడ్డానికి మళ్ళీ రాసాగారు. భూమి నవ్వు, ఏడుపుల గురించి మాట్లాడిన బాబు చుట్టూ చూశాడు. అన్నీ బాగున్నాయి. తండ్రిని మళ్ళీ చేతితో తట్టి, 'నాన్నా, భూమి మళ్ళీ నవ్వింది!' అన్నాడు.
అప్పుడు తండ్రి బాబు రెండు చేతులూ ముద్దాడి, 'మనమూ ప్రకృతిని చెడగొట్టకూడదు. చూసి ఆనందించాలి, ఆస్వాదించాలి. మనందరం ఏనుగులకు థాంక్స్‌ చెబుదాం' అన్నాడు. అక్కడున్న వారంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు. 'థాంక్స్‌ గజరాజులూ' అని ఏక కంఠంతో పలికారు.


- బెలగాం భీమేశ్వరరావు
9989537835