Oct 09,2022 10:13

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ నడుస్తోంది. పదేళ్ల క్రితం ఫామ్‌లో ఉన్న హీరోయిన్లు వరుసగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేస్తున్నారు. అలా ఒకప్పుడు స్టార్‌డమ్‌ని సొంతం చేసుకుని, కొంత గ్యాప్‌ తర్వాత వచ్చిన వారిలో ఒకరే సదా. 'జయం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. తొలి చిత్రంతోనే టాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతల చూపు కూడా తనవైపు తిప్పుకున్నారు. దీంతో వెంటవెంటనే అవకాశాలు కూడా వచ్చాయి. ఇక తాజాగా 'హలో వరల్డ్‌' అనే సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అయితే ఎప్పుడూ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు చేరువగా ఉండే సదా ఇటీవల చేసిన ఓ పోస్టు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సదా గురించిన మరిన్ని విశేషాలు..!

11

 

పేరు : సదా
అసలు పేరు : సదాఫ్‌ మొహ్మద్‌ సయ్యద్‌
పుట్టిన తేదీ : ఫిబ్రవరి 17, 1984
పుట్టిన ప్రాంతం : రత్నగిరి, మహారాష్ట్ర
నివాస ప్రాంతం : ముంబై
చదువు : గ్రాడ్యుయేషన్‌
హాబీస్‌ : డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌

'రాను రానంటూనే సిన్నదో..' పాట గుర్తుందా.. రీసెంట్‌గా ఈ పాటని నితిన్‌ 'మాచర్ల నియోజకవర్గం'లో రీమిక్స్‌ కూడా చేశారు. నితిన్‌ 'జయం' సినిమాలో అమాయకంగా 'వెళ్లవయ్యా.. వెళ్లు' అని చెప్పి.. అప్పటి కుర్రకారుకు చేరువయ్యారు నటి సదా. 'జయం' చిత్రంలో వెండితెరకు పరిచయమైన సదా హాఫ్‌ శారీ ధరించి, పల్లెటూరి అమ్మాయి పాత్రలో అద్భుతంగా చేశారు. ఆ తర్వాత 'దొంగ దొంగది', 'అవునన్నా కాదన్నా', 'అపరిచితుడు' లాంటి చిత్రాల ద్వారా తెలుగువారికి మరింత చేరువయ్యారు.
         అల్లరి నరేష్‌తో 'ప్రాణం' చిత్రంలో నటించారు. మరోపక్క 'జయం' రీమేక్‌తో తమిళంలోకీ అడుగుపెట్టారు. 'మోనాలీసా'తో కన్నడలోకీ అడుగుపెట్టారు. అలా దక్షిణాది భాషలన్నింటిలోనూ అవకాశాలు అందుకొని, 'లవ్‌ కిచిడీ' చిత్రంతో హిందీలోనూ మెరిశారు. 2014లో 'యమలీల 2'లో ఒక ప్రత్యేకపాత్రలో సందడి చేశాక, ఆమె మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ బుల్లితెరపై రియాలిటీ షోలకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ గ్లామర్‌ రంగంలో కొనసాగుతున్నారు.
        ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ యూట్యూబ్‌, సోషల్‌మీడియా వేదికలుగా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రాంలో ఒక పోస్ట్‌ పెట్టారు. 'జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి!' అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
 

                                                  ఇంత వరకూ తగల్లేదు..

కాగా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పెళ్లికి సంబంధించిన ప్రస్తావన తేగా.. 'పెళ్లి మీద నాకు ఆలోచన లేదు. నన్ను పెళ్లి చేసుకునేవాడు నా సంపాదనపై ఆధారపడకూడదు. అలాంటివాడు నాకు ఇంతవరకు తగలలేదు. అందుకే పెళ్లి చేసుకోలేదు' అని సమాధానం చెప్పారు. కాగా, ఆమె మెగా డాటర్‌ నిహారిక నిర్మించిన 'హలో వరల్డ్‌' వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించారు. ఈ సిరీస్‌ తర్వాత మరిన్ని వెబ్‌ సిరీస్‌లలో, మంచి పాత్రలలో తనను చూడబోతున్నారని తెలిపారు. అయితే ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఉదరు కిరణ్‌ ప్రస్తావన తేగా.. అతను ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని అనుకోలేదు. ఒక మంచి నటుడిని కోల్పోవడం దురదృష్టం. ఆయనతో కలిసి నేను 'ఔనన్నా కాదన్నా' చేశాను. ఎంతో మంచి వ్యక్తి. అతని కెరీర్లో ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు. అయితే ఏది జరిగినా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం కరెక్ట్‌ కాదు. కొన్నిసార్లు అవకాశాలు వస్తాయి.. కొన్నిసార్లు రావు. కానీ వీటికంటే లైఫ్‌ చాలా ముఖ్యం. దానితో నిత్యం పోరాడుతూ ఉండాలి. ఒక యాక్టర్‌గా మనం మంచిగా బెస్ట్‌ ఇవ్వాలంతే.. మిగతాది ప్రేక్షకులు మనల్ని ఎలా రిసీవ్‌ చేసుకుంటారనేది పరిస్థితులను బట్టి మారుతుంది. సమస్య వచ్చినప్పుడు చావే పరిష్కారం కాదు' అని చెప్పుకొచ్చారు.

                                                      అది మనలోనే ఉంటుంది..

'జీవితంలో అందరికీ ఉండాల్సిన లక్ష్యం సంతోషం. మనకంటూ ఆనందాన్ని ఇచ్చే విషయాలను, అభిరుచులను వ్యక్తులను గుర్తించాలి. ఆనందంగా ఉండడమనేది మనలోనే ఉంది. దానికోసం ఎక్కడెక్కడో వెతకొద్దు. మనలో ఉన్న ఆనందాన్ని వెతకండి. ఇతరుల్లో మన సంతోషం ఉండదు. మన గమ్యానికి అడ్డుగా నిలిచే వ్యక్తులు అడుగడుగునా ఉంటారు. దీంతో జీవితంలో చిరాకు కలిగించే పరిసిత్థులు ఎదురవుతాయి. వాటి గురించి ఆలోచిస్తూ ఉండకుండా.. ఆనందాన్నిచ్చే ఇతర విషయాలపై దృష్టి పెట్టాలి. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం ఎప్పటికీ స్వార్థం కాదు. స్వార్థానికి ఆత్మవిశ్వానికి చాలా తేడా ఉంటుంది. అయితే స్వార్థపూరితంగా ఉండకండి. ఆత్మగౌరవంతో ఉండండి. మనశ్శాంతిగా ఉండాలంటే మన చుట్టూ ఉన్న స్వార్థపరులకు దూరంగా ఉండాలి.' అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం సదా చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది.